Jagan Meets Modi: ప్రతీ రెండు నెలలకు ఒకసారి ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలవడం పరిపాటిగా మారింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా జగన్ కు ప్రధాని మోదీ అపాయిట్ మెంట్లు లభిస్తున్నాయి. ఇది అభినందించదగ్గ విషయమే అయినా వారి కలయిక ద్వారా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లడం ప్రధాని మోదీని కలవడం.. రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలను, ప్రయోజనాలను ప్రస్తావించినట్టు సీఎం ప్రకటించడం జరిగిపోతోంది. అనక వాటి గురించి మరిచిపోతున్నారు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదు. అయితే ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి రాష్ట్ర ప్రభుత్వం తరుపున కామన్‌గా ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నారు. అందులో పోలవరం నుంచి ఎప్పుడూ చెప్పే అన్ని అంశాలు ఉంటాయి. ఆ వివరాలతో వినతి పత్రం ఇచ్చామని చెబుతారు కానీ.. అసలు ప్రధాని స్పందనేమిటి అన్నది మాత్రం ఎవరూ చెప్పరు. చెప్పే ప్రయత్నం కూడా చేయరు. ఆయన ఇచ్చిన వినతి పత్రాలు బుట్టదాఖలవుతున్నాయా.. కనీసం పరిశీలనకు నోచుకోవడం లేదా అన్న విషయంపైనా స్పష్టత ఉండటం లేదు. ఒక వేళ పరిశీలిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ఫాలో అప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉండటం లేదు. దీంతో విపక్షాలు కొత్త పల్లవిని అందుకుంటున్నాయి. సీఎం తరచూ ప్రధానిని కలవడం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలున్నాయని.. కేసుల మాఫీకేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు హయాంలో..
టీడీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం ఇందుకు విరుద్ధం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక ప్రకటన విడుదలయ్యేది. విభజన హామీలకు సంబంధించి ఫాలో అప్ బాగా ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు ఢిల్లీ వచ్చారంటే కేంద్రమంత్రులు కూడా ఒత్తిడికి గురయ్యేవారు. కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ సఖ్యతగా మెలిగినన్నాళ్లూ పరిస్థితి చాలా బాగుండేది. అటు తరువాత రెండు పార్టీ ల మధ్య పొరపొచ్చలు వచ్చినా విభజన హామీల అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం రెండు ప్రభుత్వాలు అప్రతమత్తంగానే ఉంటూ వచ్చాయి. విభజన హామీ ద్వారా రాష్ట్రానికి లభించే అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి. కానీ గత మూడేళ్లో అలా వచ్చిన సంస్థలకు నిధులు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు కూడా గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టినవి ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వంలో ఖర్చు పెట్టినవీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బహుశా ఖర్చు పెట్టి ఉండరని అందుకే ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ అంచనాలు ఆమోదించాలని అదే పనిగా జగన్ అడుగుతున్నారు.. కానీ కేంద్రం లెక్క చేయడం లేదు.
సాక్షి మీడియా అతి..
జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది. అందులో జగన్ సొంత పత్రిక సాక్షిలో పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతున్నారు. నిజంగానే ప్రెస్ నోట్ లో రిలీజ్ చేసినవి మాత్రమే అడుగుతున్నారా అంటే.. ఎవరూ నమ్మలేకపోతున్నారు. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాజకీయాలు మాత్రమే మాట్లాడతారని.. రాష్ట్రం కోసం ఏమైనా అవసరం అయితే.. అప్పుల్లాంటి వాటి కోసం బుగ్గన.. అధికారులు వెళ్తారని అంటున్నారు. ఇతర విషయాలయితే పూర్తిగా అధికారులే కమ్యూనికేట్ చేస్తారని అంటున్నారు. ఇక తప్పని సరిగా తాను వెళ్లాలనుకున్నప్పుడే మోదీని కలిసి.. అడుగుతారని అంటున్నారు. ఈ సారి జగన్ పర్యటన పూర్తి స్థాయిలో రాజకీయమేనని.. రాష్ట్రపతి ఎన్నికల అజెండానేనని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రచారం మాత్రం… పోలవరానికి మళ్లీ జీవం పోసినట్లుగా ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు.