Janasena Extended Party Level Meeting: 2024 ఎన్నికలకు సంబంధించిన పలు హామీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు. లక్షల కోట్ల అవినీతిని అరికడితే ఈ హామీల అమలు సాధ్యమే అని తేల్చిచెప్పారు. అమరావతి రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు.అల్పాదాయ వర్గాలకు ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. ఉపాధి లేక యువత గంజాయి రవాణా వంటి అక్రమ మార్గాలు, ఆందోళన బాట పట్టకుండా… పది వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసి ఏటా లక్ష మంది యువతకు పెట్టుబడిని అందజేస్తామన్నారు. . ఇలా ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయలు అందజేస్తామని… ఐదేళ్లలో ఐదు లక్షల మందికి పెట్టుబడి అందిస్తామని పవన్ ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతిబంధకంగా మారిన సీపీఎస్ ను రద్దుచేస్తామని కూడా పవన్ వెల్లడించారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారంతో పాటు పలు కీలకాంశాలను చేర్చుతూ జనసేన సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. పార్టీ పీఏసీఎస్ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ప్రవేశపెట్టగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జిలు, వివిధ విభాగాల ఛైర్మన్లు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.
రైతుల సంక్షేమంపై తొలి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థితిగతులు, రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి ఊతమివ్వాలని నిర్ణయించారు. సాగుకు పెట్టబుడి, సాగుకు సలహాలు, సూచనలు, పంటల గిట్టుబాటు ధర, మెరుగైన మద్దతు ధర వంటి వాటిపై తీర్మానాలు రూపొందించారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఈ రెండేళ్లలో రైతు సమస్యలే అజెండాగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున నగదు సాయాన్ని అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకుగాను రూ.30 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసిన అధినేత పవన్ కల్యాణ్ కు అభినందనలు తెలిపారు.
కోనసీమలో కులాల మధ్య సమన్వయం కుదిరేలా, అంతరం తగ్గించేలా శాంతి పరిరక్షణ కమిటీలు వేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అమలాపురం విధ్వంసం వెనుక పాలకపక్ష పాత్రపై సమావేశంలో చర్చించారు. వర్గ, కుల విభేదాలను సృష్టించి లబ్ధి పొందాలనే కుట్రపూరితమైన ఉద్దేశంతోనే ఈ అల్లర్లు సృష్టించారని నాయకులు గుర్తుచేశారు. అల్లర్లతో ప్రజా జీవితానికి విఘాతం కలిగించడం అమానుషమని.. ఇటువంటి చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనతో ప్రజా జీవితం అతలాకుతలమైందని… కోనసీమలో శాంతిసామరస్యాలు నెలకొని జనజీవనం ప్రశాంతంగా సాగాలని కోరుకొంటూ.. శాంతి కమిటీలను ఏర్పాటు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు.
జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులను నియంత్రించేందుకు, వారికి అండగా నిలిచేందుకు నిర్ణయిస్తూ మూడో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులపై జరుగుతున్న దాడుల గురించి చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజా పక్షం, బాధిత వర్గాల పక్షం వహించిన సందర్భాల్లోనూ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్న విషయాన్ని నాయకులు ఏకరవు పెట్టారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు పంచుకున్న వేధిస్తున్నారని వాపోయారు. శ్రేణులకు పార్టీ అండగా నిలిచి న్యాయపరంగా పోరాటం చేస్తుందని తీర్మానించారు.
రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిరక్షణపై తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధానంగా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, ప్రభుత్వ ప్రేక్షక పాత్రపై చర్చించారు. సీఎం , రాష్ట్ర డీజీపీ, హోమ్ శాఖ మంత్రి, ఇతర మంత్రులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని నేతలు ప్రస్తావించారు. అత్యాచారాలకు తల్లుల పెంపకంలోనే లోపం ఉందని హోమ్ శాఖ మంత్రి వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు రాష్ట్రం హబ్ గా మారడంపై సమావేశంలో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే వాటిని నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడానికి తీర్మానించారు.