జగన్ మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఎట్టకేలకు ప్రధానమంత్రి మోడీ అపాయింట్‌మెంట్ జగన్‌కు లభించింది. గత వారమే హోంమంత్రి అమిత్‌షాతో రెండు సార్లు జగన్ భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఈ పర్యటనపై ప్రతిపక్షమైన టీడీపీ పలు ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు మోడీని కలిసేందుకు వెళ్లారు. నేడు ప్రధానితో సమావేశం కానున్నారు.
Also Read: రైతులకు దన్నుగా జగన్ సర్కార్.. 16 నుంచి పంటల కొనుగోళ్లు..?
ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం జగన్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఢిల్లీలోని వైసీపీ నేతలు కూడా తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. చివరికి ఓకే కావడంతో సీఎం జగన్ కి పిలుపువచ్చింది. అయితే.. ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓ నివేదిక సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ సర్కార్‌కు కేంద్రం బాసటగా నిలుస్తోంది. అవసరమైనప్పుడల్లా.. అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ క్రమంలో మరింత ఆర్థిక సాయం జగన్ అడిగే అవకాశం ఉంది. అదే సమయంలో.. ఏపీలో రాజకీయ పరిస్థితులను కూడా ఆయన ముందు పెట్టే అవకాశం ఉందంటున్నారు. రాజధాని భూములపై, ఫైబర్ గ్రిప్డ్ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతున్నారు. తద్వారా టీడీపీ ఖేల్ ఖతం చేయాలనే పట్టుదలతో జగన్ ఉన్నట్టు తెలిసింది. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు కూడా అదే డిమాండ్ చేశారు. వీటిని మాత్రం సాధించుకు రావాలన్న పట్టుదలతో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు.
జగన్‌కు మోడీ అపాయింట్‌మెంట్ దొరికింది మంగళవారం కలిసేందుకే.. కానీ మరోవైపు అపెక్స్ కౌన్సిల్ భేటీ కూడా మంగళవారమే ఉంది. ఈ భేటీలోనూ ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనాలి. ఇది వర్చువల్ భేటీ మాత్రమే. ఢిల్లీకి కూడా వెళ్లాల్సిన పనిలేదు. కానీ.. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మోడీ అపాయింట్‌మెంట్ దొరకడంతో జగన్ వెంటనే ఢిల్లీకి పయనమయ్యారు. అయితే.. మోడీతో భేటీతోపాటే జగన్ నేరుగా అపెక్స్ భేటీకి వెళ్తారని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ మాత్రం హైదరాబాద్ నుంచి వర్చవల్ గా పాల్గొనే అవకాశం ఉంది.
Also Read: మందుబాబులకు జగన్ సర్కార్ భారీ షాక్..?
మొత్తానికి జగన్మోహన్ రెడ్డి స్వల్ప వ్యవధిలోనే రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏదో జరుగుతోందనే అనుమానం మాత్రం ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ తన కేసుల నుంచి బయటపడేందుకే కేంద్ర పెద్దలతో భేటీకి దిగుతున్నారని ఆరోపిస్తూనే ఉన్నారు.