ఓ వైపు రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో.. ఇక ప్రధాన పార్టీలన్నీ తిరుపతిపై ఫోకస్ పెట్టాయి. ఇక వైసీపీ, టీడీపీ జనసేన–-బీజేపీలు కూడా పోటీపై ఓ క్లారిటీకి వచ్చేశాయి. పవన్‌తో చర్చించి బీజేపీ నుంచి అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటన విడుదలైంది. దీంతో కమలం పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ జరుగుతోంది
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా ఇక తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం తిరుపతికి బయలుదేరనున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగా.. అటు దేవాలయాలపై ప్రభుత్వం దాడులు చేయిస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా.. ఇటు తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ తిరుపతి పయనమైనట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి తిరుపతిలో బస చేసి, బుధవారం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఆయన ఈ సమయంలో తిరుపతి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుందని ఫ్యాన్ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.
2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ తరువాత రెండేళ్లకు జరిగిన పంచాయతీ ఎన్నికలు బరిలోకి దిగింది. అయితే ప్రతిపక్షాల ప్రభుత్వంపై విమర్శలు, అటు ఎలక్షన్ కమిషన్ తో కోల్డ్ వార్ జరిగిన నేపథ్యంలో వైసీపీని ప్రజలు ఆదరిస్తారా..? లేదా..? అన్న సందేహం సొంత పార్టీ నాయకుల్లోనే కలిగింది. వీటన్నింటిన ఆసరాగా చేసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ప్రచారం చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిప్పికొడతారని అనుకున్నారు.
అటు దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ, జనసేనలు ఆందోళనలు కొనసాగించాయి. ప్రభుత్వం కావాలనే ఆలయాలపై దాడులు చేయిస్తుందని ప్రచారం చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఏ విధంగా స్పందించకుండా దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతూ వచ్చింది. ఈ ప్రభావం పంచాయతీ ఎన్నిలపై చూపుతుందని బీజేపీ, జనసేనలు భావించాయి.
కానీ జగన్ పై ఉన్న నమ్మకాన్ని ఏపీ ప్రజలు మరోసారి చూపించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ మెజారిటీ ఇచ్చేశారు. దీంతో ప్రజలు వైసీపీతోనే ఉన్నట్లు చెప్పేశారు. ఈ నేపథ్యంలో జగర్ ఈరోజు తిరుపతి పర్యటనకు వెళ్లి అక్కడి ఉప ఎన్నికలో విజయం సాధించేలా కార్యాచరణ ప్రారంభించనున్నారు. కేవలం గెలుపు కోసమే కాకుండా మెజారిటీ విషయంపై కూడా దృష్టి సారించనున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుందని చెప్పేలా వ్యూహం పన్ననున్నారు.
ఇక తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిపై ఆసక్తి నెలకొంది.ఈ రేసులో ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ముగ్గురు రిటైర్ అధికారులు, మరో స్థానిక నేత అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ నలుగురిలో రిటైర్డు ఐఏఎస్ అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ ఉన్నారు. ఇక తిరుపతి బీజేపీ నేత ముని సుబ్రమణ్యం పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరిలో దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. గతంలో కూడా తిరుపతి నుంచి విద్యావంతులకు అవకాశం ఇస్తున్నారు.