CM Jagan: వినేవాడు వెర్రి వాడు అయితే.. చెప్పేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టు ఉంది పరిస్థితి. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. కానీ తెలివిగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు. తన మాటల్లో డొల్లతనాన్ని బయటపెడతాడు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో రకరకాల సెంటిమెంట్లను తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం పై కొత్త కథలు అల్లుతున్నారు. మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తూ పొలిటికల్ డ్రామా పండించాలని చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని ఎన్నోసార్లు తమ స్వలాభం కోసం వాడుకున్నారు. అరిగిపోయిన రికార్డ్ మాదిరిగా పదేపదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సీఎం పోస్టును జగన్ కు ఇవ్వలేదని కుటుంబంతో సహా కాంగ్రెస్ పై పడిపోయారు. రిలయన్స్ కంపెనీతో చేతులు కలిపి సోనియాగాంధీ ఈ పని చేయించారని నోటికొచ్చినట్లు మాట్లాడారు. లెక్కలేనన్ని ఆరోపణలు చేశారు. ఇలా ఆరోపణలు చేసిన తల్లి విజయమ్మ, కుమార్తె షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. కానీ జగన్, ఆయన వెనుకున్న మంది మాత్రం కొత్త కథలు అల్లుతున్నారు. సకల శాఖ మంత్రి సజ్జల వారు అయితే సరికొత్త ఆరోపణలతో ముందుకు వచ్చారు.
ఆయనకు ఎందుకో కొన్ని విషయాల్లో అడ్డదిడ్డంగా మాట్లాడేస్తున్నారు. ఆయన మాటలు చూస్తే వినే వాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటుంది. కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి రిలయన్స్ రాజశేఖర్ రెడ్డిని చంపిందని ఆరోపించారు. అదే రిలయన్స్ కి చెందిన పరిమల్ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ సీటు ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలతోనే ఓటు వేయించి తన తండ్రిని చంపిన రిలయన్స్ కు జేజేలు పలికారు. గతంలో ఇదే రిలయన్స్ పై ఆరోపణలు చేశామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. అదంతా రాజకీయం కోసమేనని అర్థం వచ్చేలా వ్యవహరించారు.
ఏదైనా ఒకసారి చెబితే ప్రజలు నమ్ముతారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మహానేత మరణం పై తలోరకంగా మాట్లాడడం మొదటికే మోసం వస్తుందన్న విషయం తెలుసుకోవాలి. తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని.. దానినే పెట్టుబడిగా మార్చుకొని రాజకీయం చేయగల ధైర్యాన్ని జగన్. అయితే ఈ క్రమంలో తల్లి, చెల్లిని దూరం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారని అపవాదును అయితే మూటగట్టుకున్నారు.