
Jagan- Pawan Kalyan: భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ జగన్ ది..వైసీపీ శ్రేణులు తరచూ చెప్పే మాట ఇది. ఎవరికీ భయపడే మనస్తాత్వం జగన్ ది కాదని వైసీపీ నేతలు, సన్నిహితులు చెబుతుంటారు. ఆ భయమే ఉంటే దేశాన్నే ఏలుతున్న సోనియాగాంధీకి ఎదురు తిరిగేవారా? జైలు జీవితం అనుభవించేవారా? సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసేవారా? అంటూ ప్రశ్నలు సంధిస్తుంటారు. అయితే అప్పట్లో ఉండే ధైర్యం వేరు. అధికారం వస్తుందని ఆశ, యావతో ఎంద దూరానికైనా తెగించవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయితే అధికారం అనే రుచి మరిగిన తరువాత దానిని వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. అప్పుడు కచ్చితంగా భయపడాల్సిందే. లేకుంటే మూల్యం తప్పదు. అందుకే ఇప్పుడు జగన్ భయపడుతున్నారో లేదో చెప్పలేం కానీ.. దానికి అర్ధం వచ్చేలా మాత్రం వ్యవహరిస్తున్నారు.
ఈ మధ్య ఇంటా, బయటా సీఎం జగన్ ఒక పద ప్రయోగం ఎక్కువగా చేస్తున్నారు. ‘దమ్ముంటే సింగిల్ గా 175 నియోజకవర్గాల్లో పోటీచేసే దమ్ముందా?’ అని ప్రశ్నిస్తున్నారు. వీళ్లలా నేను పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడను. పవన్ దత్తపుత్రుడు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఇది వ్యూహంలో భాగమని తొలుత వ్యాఖ్యానించారు. అయితే జగన్ ఎక్కడకు వెళ్లినా.. వేదిక ఏదైనా వారిద్దరు పొత్తుల గురించే మాట్లాడుతుండడంతో ఎక్కువ మంది భయంగా నమ్ముతున్నారు. భయంతోనే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని నిర్ధారణకు వస్తున్నారు. ఈ ఒక్క సవాల్ తో జగన్ తనలో ఉన్న భయాన్ని బయటపెట్టుకుంటున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. పొత్తులతో వస్తే చంద్రబాబు, పవన్‌ను జగన్ తట్టుకోలేరనే సంకేతాల్సి తనకు తానుగా సీఎం పంపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని జగన్ చెప్పని సందర్భం వుండదు. ఒక్కో నాయకుడి నమ్మకాలు, విశ్వాసాలు ఒక్కో రకంగా వుంటాయి. తమ బలమైన ప్రత్యర్థి వైఎస్ జగన్‌ను ఓడించడానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పొత్తుల్నే నమ్ముకున్నారు. ఇందులో తప్పేం ఉంది అన్న ప్రశ్నలైతే ఉత్పన్నమవుతున్నాయి.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తులతోనే అధికారంలోకి వచ్చింది. నాడు వామపక్షాలు, కేసీఆర్ తో కలిసి మహా కూటమి కట్టారు. అధికారంలోకి రాగలిగారు. రాజశేఖర్ రెడ్డి సీఎం కాగలిగారు. అప్పటి టీఆర్ఎస్ కు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారు. అయితే అది పార్టీల వ్యూహాలు ఎన్నికల రాజకీయాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూడా బలమైన అధికారపక్షంగా ఉన్న వైసీపీని ఓడించడానికి చంద్రబాబు, పవన్ లు కలుస్తున్నారు. అందులో తప్పులను ఎంచే దాని కంటే వారిని రాజకీయంగా ఎదుర్కొని తనను తాను నిలబెట్టుకోవాలి. సోనియా గాంధీని ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడు.. ఇప్పుడు వీరిద్దరిపై అదే ధైర్యాన్ని అప్లయ్ చెయ్యొచ్చు కదా. కానీ దానిని వదిలి పదేపదే పొత్తులపై మాట్లాడడం తనలో ఉన్న భయాన్ని తెలుపుతోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ భారీ ఆధిక్యతతో సొంతం చేసుకుంది. చివరకు వైసీపీ అడ్డా అయిన రాయలసీమలో సైతం తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఇటువంటి సమయంలో ధైర్యమైన ప్రకటన చేయాలి. కానీ వైసీపీ అడ్డగోలు వాదనకు తెరతీస్తోంది. అసలు వారు మా పార్టీ వారే కారని చెబుతోంది. అటువంటి సమయంలో పశ్చిమ రాయలసీమ స్థానంలో కౌంటింగ్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేస్తామని సజ్జలలాంటి పెద్దలు ప్రకటన దేనికి సంకేతం. పోనీ సీఎం జగన్ అయినా బాధ్యతగా వ్యవహరించారంటే అదీ లేదు. నిన్నటి తిరువూరులో జరిగిన సభలో వైఎస్ జగన్ ఏమన్నారంటే… “నా ప్రభుత్వం మంచి చేయలేదని ప్రతిపక్షాలు భావిస్తే, పొత్తుల కోసం వాళ్లు ఎందుకు వెంపర్లాడుతున్నారు? వాళ్లకు సవాళ్లు విసురుతున్నా…175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం చంద్రబాబు, దత్తపుత్రుడికి ఉన్నాయా? వీళ్లలా పొత్తులు పెట్టుకునేందుకు నేను వెంపర్లాడను. నేను నమ్ముకున్నది ఆ దేవుడిని, ప్రజల్నే” అని అన్నారు. అంటే పాడిందే పాటగా అదే మాటలు చెప్పారు. తనలో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు.