
వైఎస్ జగన్.. మంచి దూకుడు ఉన్న నేత. ఏ నిర్ణయాన్ని అయినా ఇట్టే తీసుకుంటుంటారు. చెప్పాలంటే ఆయనలో ప్లస్ పాయింటే దూకుడు. ఎన్నిసార్లు భంగపాటుకు గురైనా ఆయన దూకుడులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఎవరేమి అనుకున్నా.. ఎవరు ఏమీ అన్నా తన పంథాలో తాను వెళ్తుంటారు. ఇక జగన్ 2012లో కాంగ్రెస్‌ను ఎదిరించి జైలుపాలు అయినపుడు ఆయన రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. 2014 ఎన్నికల్లో తృటిలో అధికారాన్ని పోగొట్టుకున్నపుడు ఆయనకు ఎత్తులు జిత్తులు కూడా తెలియదు.
Also Read: జగన్ మొండి పట్టుతో మార్పు.. అనూహ్య పరిణామం..
ఇక 2017 నాటికి వైసీపీని టీడీపీ ఖాళీ చేస్తున్నపుడు ఆయనకు పార్టీని ఎలా నడపడమో కూడా అంతుబట్టని విషయం. తాజాగా జగన్ గురించి అంటున్న మాట ఆయన సరిగ్గా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేదని. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారు. ఆయన రాజ్యాంగం గురించి ఒక మంచి మాట చెప్పారు. రాజ్యాంగం బహు గొప్పది. కానీ ఆ గొప్పతనం తెలియాలి అంటే రాజ్యాంగ వ్యవస్థలో కూర్చున్న వారు కూడా గొప్పగానే వ్యవహరించాలి అని. కానీ.. మనం రాజ్యాంగం వరకే చూస్తున్నాం. జగన్ మాత్రం ఇంకా లోతుగా చూస్తున్నారు. ఈ రాజ్యాంగం కల్పించిన వ్యవస్థలకు రక్షణగా కోర్టులు ఎప్పుడూ ఉంటాయన్న సత్యాన్ని ఆయన మరచిపోతున్నారు. అందుకే ఈ 20 నెలల కాలంలో ఎన్నో మొట్టికాయలు వరసగా జగన్ సర్కార్ మీద పడుతున్నాయి.
రాజకీయాలను.. రాజ్యాంగాన్ని జగన్ అర్థం చేసుకోకున్నా ప్రజలను మాత్రం బాగా అర్థం చేసుకున్నారు. ఆయన పాదయాత్రలో వేలాది కిలోమీటర్లు నడిచారు. ప్రజల మనసులను గెలుచుకున్నారు. వారి కోసం ఏదో చేయాలని తపన ఆయనకు ఉంది. అందుకే వచ్చిన వెంటనే తొంబై శాతం హామీలను నెరవేర్చారు. కానీ.. ఆయన ఇంకా చాలా చేయాలి అనుకుంటున్నారు. కానీ.. ఏది చేయాలన్నా కూడా రాజ్యాంగబధ్ధమైన ప్రక్రియలోనే ముందుకు సాగాలి. వ్యవస్థలతో సర్దుబాటు చేసుకుంటూనే ముందుకు సాగాలి. సంఘర్షణే నా పథం అని జగన్ కనుక ఆలోచిస్తే ఆయన అర్థం చేసుకున్న ప్రజలే నష్టపోతారు.
Also Read: ఏపీలో బీజేపీ అసలు టార్గెట్ అదే..?
మన ప్రజస్వామ్య దేశంలో ఏదీ ఓవర్ నైట్ జరిగేది కాదు. జగన్ విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా తొలి అడుగులు వేస్తున్నారు. ఇంత దూకుడు వద్దని అడ్డుపడే వారూ ఉన్నారు. రెండు మూడు సార్లు గెలిచిన వారు కూడా వెళ్లని వ్యవస్థల జోలికి జగన్ వెళ్లి చేయి కాల్చుకుంటున్నారు అన్న సానుభూతి కూడా ఉంది. కానీ.. జగన్‌కు ఏమీ అర్థం కాదా? ఆయనది కేవలం దూకుడేనా? అంటే కానే కాదు, జగన్ కి అన్నీ అర్థమవుతాయి. ఆయన ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా దూకుడు చూపుతున్నారంతే.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్