CM Jagan: ఆరోగ్యశ్రీ పై అంతలా నమ్మకం పెట్టుకున్న జగన్

ఆరోగ్యశ్రీ నుంచి అప్రూవల్ వస్తే పథకం వర్తిస్తుందని చెప్పుకొస్తున్నారు. తీరా ఆపరేషన్ చేశాక.. ఆరోగ్యశ్రీ వర్తించలేదని కొన్ని ఆసుపత్రులు యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయి.

Written By: Dharma, Updated On : September 30, 2023 2:38 pm

CM Jagan

Follow us on

CM Jagan: ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్తున్న రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయా? ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న రుగ్మతలన్నింటికీ చికిత్సలు చేస్తున్నారా? నెట్వర్క్ ఆసుపత్రులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నారా? అంటే వైసీపీ సర్కార్ అవుననే సమాధానం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. తాజాగా ఆరోగ్యశ్రీ పథకం పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. ఈ విషయం సర్వేలో తేలిందని సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఇటువంటి సర్వేలను నమ్ముకొని గత పాలకులు సైతం చతికిల పడ్డారు. ఇప్పుడు ఆ వంతు జగన్ కు వచ్చినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించాలన్నదే ఆరోగ్య శ్రీ లక్ష్యం. కానీ అత్యవసర వైద్య సేవలకు వస్తున్న రోగులకు నెట్వర్క్ ఆసుపత్రులు ఝలక్ ఇస్తున్నాయి. అత్యవసర వైద్యం కావాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. సొంత డబ్బులు పెట్టుకోవాలని.. ఆరోగ్యశ్రీ నుంచి అప్రూవల్ వస్తే పథకం వర్తిస్తుందని చెప్పుకొస్తున్నారు. తీరా ఆపరేషన్ చేశాక.. ఆరోగ్యశ్రీ వర్తించలేదని కొన్ని ఆసుపత్రులు యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయి. దీనికి కూడా ప్రభుత్వ తీరే కారణం. ఏళ్ల తరబడి నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం పెండింగ్లో పెడుతోంది. దీంతో యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు కంటే.. సాధారణ వైద్యానికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ ఏడాది మేలో రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు పెరుగుపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సేవలను ప్రారంభించాయి.

అటు ఆరోగ్యశ్రీ జాబితాలో వందలాది రుగ్మతలు, వైద్య చికిత్సలు ఉన్నాయి. కానీ నెట్వర్క్ ఆసుపత్రులకు రోగులు వచ్చి చికిత్స చేసుకుంటాం అంటే.. ఫలానా రుగ్మతకు ఆరోగ్యశ్రీలో చోటు లేదని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. దీంతో అత్యవసర వైద్యం పొందాలనుకున్నవారు సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు బాధతో అక్కడ నుంచి వెను తిరుగుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలావరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు మూతపడ్డాయి. చేసిన వైద్య సేవలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఇలా బిల్లుల చెల్లింపు నిలిచిపోయిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికర అంశంగా మారిపోయింది.

అయితే తాజాగా సీఎం జగన్ ఆరోగ్యశ్రీ సేవలతో ఏపీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఇందులో వాస్తవాన్ని ఆయన గుర్తించలేకపోయారు. సర్వేలో ఇది తేలినట్లు చెప్పుకొస్తున్నారు. సాధారణంగా సర్వే సేవలు అందుతున్నాయా? లేదా? ఉన్నంతవరకే జరుగుతుంది. లోతైన అంశాల జోలికి సర్వే ప్రతినిధులు వెళ్లరు. వైద్య సేవలు, మందులు, వసతులు, సమస్యలు వంటి వాటిని ప్రస్తావించరు. ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యశ్రీపై ఉన్న మంచి అభిప్రాయాన్ని సేకరించి మాత్రమే ప్రభుత్వానికి నివేదిస్తారు. గతంలో కూడా చంద్రబాబు ఇటువంటి సర్వేలను నమ్మే దెబ్బతిన్నారు. ఇప్పుడు జగన్ సైతం అదే రకం సర్వేలను నమ్ముతుండడం విశేషం.