https://oktelugu.com/

JC Divakar Reddy : జగన్ కు ఇలా ఝలక్ ఇచ్చిన జేసీ

జేసీ కుటుంబం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాడిపత్రి మునిసిపల్ పీఠం కైవసం చేసుకొని తన పట్టు తగ్గలేదని నిరూపించుకున్నారు.

Written By: Dharma, Updated On : April 26, 2023 6:42 pm
Follow us on

JC Divakar Reddy : జేసీ దివాకర్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. రాయలసీమ జిల్లాల్లో రాజకీయాలు నెరిపిన సీనియర్ నాయకుడు. ముఖ్యంగా అనంతపురంలో తన మార్కు చూపిస్తూ వస్తున్నారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జేసీ కుటుంబం జగన్ దెబ్బకు విల్లవిల్లాడిపోయింది. ఎన్నికల తరువాత కూడా జగన్ జేసీ ఫ్యామిలీకి చుక్కలు చూపించారు. ఒకానొక దశలో జేసీ ఫ్యామిలీ అస్త్రసన్యాసం తీసుకోనుందని వార్తలు వచ్చాయి. తన కుటుంబ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడమే కాకుండా కేసులు చుట్టుముట్టడంతో జేసీ సోదరులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దివాకర్ ట్రావెల్స్ లో అవకతవకలను సాకుగా చూపి ప్రభాకరరెడ్డిపై కేసుల నమోదు చేయడమే కాకుండా అరెస్టులు సైతం చేశారు. ప్రస్తుతం ప్రభాకరరెడ్డి బెయిల్ పై ఉన్నారు. దీంతో జేసీ ఫ్యామిలీ రాజకీయంగా సమాధి అయినట్టేనని అంతా భావించారు. కానీ జేసీ కుటుంబం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాడిపత్రి మునిసిపల్ పీఠం కైవసం చేసుకొని తన పట్టు దక్కలేదని నిరూపించుకున్నారు.

వారసులకు రంగంలోకి దించినా..
గత ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయలేదు. అటు ప్రభాకరరెడ్డి సైతం తప్పుకున్నారు. ఇద్దరు నాయకులు తమ వారసులచే పోటీచేయించారు. అనంతపురం ఎంపీగా దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ నుంచి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిని బరిలో దించారు. ఇద్దరూ ఓడిపోయారు. దీంతో జేసీ ఫ్యామిలీ రాజకీయ శకం ముగిసినట్టేనని అంతా భావించారు. కానీ ఆరు పదుల వయసులో సైతం ఆ ఇద్దరు సోదరులు వెనక్కి తగ్గలేదు. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా ప్రభాకరరెడ్డి అధికార పార్టీతో సై అంటున్నారు. తాజాగా దివాకర్ రెడ్డి సైతం తగ్గేదేలా అంటూ పావులు కదుపుతున్నారు.

రాయలసీమపై ఫోకస్..
ఇటీవలే రాయలసీమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేసిన దివాకర్ రెడ్డి రాయలసీమలో దూకుడు పెంచారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఊపులోఉన్న టీడీపీలోకి మరింత మంది నాయకులను చేర్పించే పనిలో పడ్డారు.అందులో భాగంగా శింగనమల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ ను పార్టీలోకి రప్పించే గురుతర బాధ్యతలు తీసుకున్నారు. వసతి దీవెన కార్యక్రమానికి సీఎం జగన్ వచ్చిన రోజే సాకే శైలజానాథ్ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తాడోపేడో అని జగన్ కు స్పష్టమైన సంకేతాలు పంపినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

శైలజానాథ్ తో మంతనాలు
ప్రస్తుతం శింగనమల టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా బండారు శ్రావణి ఉన్నారు. ఆమెపై సొంత పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత ఉంది. అందుకే అక్కడ ఐదుగురి నాయకులతో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో సాకే శైలజానాథ్ ను టీడీపీలోకి రప్పించాలని దివాకర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో శింగనమల నుంచి గెలిచిన శైలజానాథ్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. మొన్నటి వరకూ పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. బలమైన ఎస్సీ నేత కావడంతో టీడీపీలోకి రప్పించి టిక్కెట్ కట్టబెడితే ఆ సీటు ఖాయమని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.ఆ బాధ్యతను జేసీ దివాకర్ రెడ్డి తీసుకోవడం.. జగన్ అదే నియోజకవర్గంలో ఉండగా మంతనాలు జరపడంతో సవాల్ విసిరినట్టయ్యింది.