
ఈమధ్య కోర్టుల నుంచి ఏపీ ప్రభుత్వానికి వరుసగా మొట్టికాయలు పడుతున్నాయి. అయితే ఈసారి కోర్టు నుంచి వచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ తీర్పుతో విద్యార్థులకే కాకుండా ప్రతిపక్ష టీడీపీకి లాభం చేకూరినట్లయింది. అయితే ఇది పరోక్షంగా జగన్ ఆ పార్టీకి ఇచ్చిన క్రెడిటే అని అంటున్నారు. కోర్టు తీర్పుతో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినా.. రాకున్నా.. తెలుగుదేశం పార్టీ మాత్రం తమ పోరాట విజయంగా భావిస్తోంది. ముఖ్యంగా ఇన్నిరోజులు లోకం తెలియని బాలుడు అనే విమర్శలు ఎదుర్కొన్న లోకేశ్ ఈ పోరాటంలో ముఖ్యుడు కావడం టీడీపీలోనూ కాస్త బలం చేకూరినట్లయింది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా 1 నుంచి 9 వ తరగతి వరకు పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. అయితే టీడీపీ నాయకులు చంద్రబాబు, లోకేశ్ టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా లోకేశ్ ఈ విషయంపై టెక్నిక్ గా వ్యవహరించాడు. అయితే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు రమేశ్ టీడీపీ నాయకుల విమర్శలు కొట్టిపారేస్తూ ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పొకొస్తున్నారు.
కానీ లోకేశ్ మాత్రం జూమ్ యాప్ లను ఉపయోగించి నిత్యం విద్యార్థలతో మీటింగ్ పెట్టారు. వారితో కనెక్టయి నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ పరీక్షల రద్దును తాము వెనుకాడబోం అని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇతర ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలు రద్దు చేసినప్పుడు ఇక్కడేంటి..? అన్న విధంగా చర్చించుకున్నారు. దీంతో మూకుమ్మడిగా ప్రభుత్వంపైవిమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది.
ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల మరణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రశ్నించడంతో పరీక్షల నిర్వహణను రద్దు చేసింది. దీంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమయింది. అయితే మొదటి నుంచి టెన్త్ పరీక్షల రద్దుకు డిమాండ్ చేస్తున్న లోకేశ్ కు ఈ వ్యవహరంలో ప్లస్ పాయింట్ వచ్చింది. తమ పోరాటంతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని టీడీపీ నాయకులు అంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో థ్యాంక్యూ లోకేశ్ ట్యాగ్ తో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జగన్ ఈ నిర్ణయమేదో ఎప్పుడో తీసుకుంటే లోకేశ్ సీన్లోకి వచ్చేవారు కాదు కదా..? అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.