
YS Jagan: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశామని వైసీపీ నేతలు తెగ ఆనందపడుతున్నారు. గత నాలుగేళ్లలో దక్కిన అపవాదులకు చెక్ పడిందని భావిస్తున్నారు. ముఖేష్ అంబానీ వంటి వారు వచ్చి తమకు అండగా నిలబడ్డారని.. ఇక తిరుగులేదని సంబరపడిపోతున్నారు. ఏకంగా రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఊరూ వాడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది అంకెల గారడీగానే మిగులుతుందని ఏపీలో మెజార్టీ వర్గాల వారి అభిప్రాయం. అయితే ఇలా ఒకవైపు నమ్మకం లేకపోతుండగా.. అటు రాయలసీమ ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలను ఏవగించుకుంటున్నారు. పెట్టుబడులంతా విశాఖలో పెట్టుకుంటే రాయలసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ముచ్చట తెరపైకి తెచ్చింది. పాలనా వికేంద్రీకరణకుగాను విశాఖలో ఎగ్జిక్యూటీవ్ కేపిటల్, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కానీ రాయలసీమ నుంచి అంతులేని రాజకీయ విశ్వాసం చూరగొన్న జగన్ నిర్ణయానికి అక్కడి ప్రజలు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఏదో విధంగా జగన్ సీమకు న్యాయం చేస్తారు కదా అని సరిపెట్టుకున్నారు. అయితే క్రమేపీ ఆయనపై నమ్మకం సన్నగిల్లుతోంది. అందుకే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులు ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి ఎంత? అనేది విభజించి లెక్కలు చెప్పాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
Also Read: global summit vizag : సమ్మిట్ అంతా డొల్లేనా? కోటి రూపాయలు లాభం పొందని కంపెనీలో ఒప్పందాలా?
వాస్తవానికి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ ఎంపిక సీమ వాసులకు పెద్దగా నచ్చలేదు. అనంతపురంలో ఓ నిరుపేద ప్రభుత్వ పని మీద విశాఖ వెళ్లిరావాలంటే రవాణా ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యయప్రయాసలు పడాల్సి ఉంటుంది. అటువంటి వారికి కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? ఇప్పటికే విశాఖ అన్నివిధాలా అభివృద్ధి చెందింది. రాజధాని ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందుతుందే తప్ప.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు ఒనగూరే ప్రయోజనాలంటూ ఉండవు. అదే హైకోర్టు విశాఖలో ఏర్పాటుచేసి.. రాజధానిని సీమలో ఏర్పాటుచేసి ఉంటే ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు.
గత ఎన్నికల్లో ఏ ప్రాంత ప్రజల సంపూర్ణ మద్దతు పొందారో.. ఇప్పుడు చేజేతులా జగన్ వారిని దూరం చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. తొలుత జగన్ వినిపించిన పాలనా వికేంద్రీకరణ మాట వినసొంపుగా వినిపించింది. వాస్తవానికి రాయలసీమలో తిరుపతి, కోస్తాలో గంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలే అభివృద్ధి సాదించాయి. మిగతా తొమ్మిది జిల్లాల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. ఇప్పుడు ఇంత పెద్దఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న దృష్ట్యా..ఈ సమయంలోనే న్యాయబద్ధంగా పెట్టుబడులు విభజించకపోతే అన్ని ప్రాంతాల ప్రజల మధ్య జగన్ విలన్ గా మారే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమ ప్రజలు దూరమయ్యే చాన్స్ అధికంగా ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Natu Natu -WPL : గోల్డెన్ గ్లోబైనా.. డబ్ల్యూపీఎల్ అయినా.. నాటు నాటు ఉండాల్సిందే