Homeఆంధ్రప్రదేశ్‌global summit vizag : సమ్మిట్ అంతా డొల్లేనా? కోటి రూపాయలు లాభం పొందని కంపెనీలో...

global summit vizag : సమ్మిట్ అంతా డొల్లేనా? కోటి రూపాయలు లాభం పొందని కంపెనీలో ఒప్పందాలా?

global summit vizag : మనం చేస్తే లోక కళ్యాణం.. వేరొకరు చేస్తే వ్యభిచారం అన్నట్టుంది వైసీపీ సర్కారు నిర్వాకం. నాడు చంద్రబాబు ఇదే పారిశ్రామిక పెట్టుబడులు సదస్సు నిర్వహిస్తే.. నాడు విపక్షంలో ఉన్న వైసీపీ నానా యాగీ చేసింది. 2016, 17, 18 సంవత్సరాల్లో వరుసగా చంద్రబాబు సర్కారు సీఐఐ సదస్సులు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఇదే విశాఖలో ఏర్పాటుచేసింది. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను పిలిచింది. సుమారు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటించింది. అయినా నాడు విపక్ష నేత జగన్ నుంచి కిందిస్థాయి నేతల వరకూ అది అసలు ఒక పారిశ్రామిక సదస్సులేనా అని ఎద్దేవా చేశారు. దారిన పోయేవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు అంతకంటే కిందిస్థాయి కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కనీసం ఏడాదికి కోటి రూపాయల ఆదాయం లేని కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఏంలాభం అన్న టాక్ వినిపిస్తోంది.

గత నాలుగేళ్లుగా ఏపీలో పారిశ్రామిక ప్రగతి లేనిది వాస్తవం. విపక్షంలో ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని..తాము అధికారంలోకి వస్తే పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంగతే మరిచారు. అయితే నాలుగేళ్ల తరువాత రాజకీయ అవసరాల కోసమో.. లేకపోతే చిత్తశుద్ధితో గుర్తించారో కానీ ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను ఏర్పాటుచేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రయత్నిస్తుండడంతో సర్వత్రా ఇంట్రెస్ట్ గా చూశారు. కానీ ఒప్పందాల విషయంలో నడిచిన వ్యవహారం.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలను చూస్తే మాత్రం అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విమర్శల జడివానను ప్రారంభించారు.

ఈ సదస్సు ద్వారా మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని ఏపీ పాలకులు చెబుతున్నారు. కానీ ముందుగా పరిచయం ఉన్న కంపెనీలను ఒప్పించి  ఒప్పందాల తంతు ముగించినట్టు టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పిందని.. ఇప్పుడు మనం కూడా ఆ గణాంకానికి దగ్గరగా ఓ ఫిగర్ వేసి ప్రచారానికి వాడుకుందాం అన్నట్టుంది జగన్ సర్కారు వ్యవహార శైలి. ఇప్పుడు లక్షలు, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చిన కంపెనీల చేతుల్లో కనీసం రూ.10 కోట్లు లేని దుస్థితి. అవి ఎలా పెట్టుబడి పెడతాయో మన ఏపీ పాలకులకే ఎరుక. మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే రెట్టింపు పెట్టుబడులు పెడతామని కొన్ని ఔత్సాహిక పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం అనమానాలకు తావిస్తోంది.

రాజకీయంగానే కాదు.. ఇప్పుడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అడ్డాగా పులివెందుల నిలిచింది. తాజా విశాఖ సదస్సుతో వెల్లడైంది. పులివెందులకు చెందిన చాలా కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో ఇండోసోల్ కంపెనీ ఒకటి. అసలు ఈ కంపెనీకి యజమానులెవరో బయట ప్రపంచంలో అందరికీ తెలుసు. ఏడాదికి రూ. కోటి లాభం కూడా చూపించుకోలేని కంపెనీ లక్ష కోట్లు ఎలా పెడుతుంది. ఇంకో సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ సంస్థకు ఇప్పటికే ప్రజాధనం వేల కోట్లు దాచి పెడుతున్నారు. ఇక్ అవాడా అనే మరో కంపెనీ కూడా పులివెందులలోనే వ్యాపారం చేస్తోంది. విద్యుత్ ప్రాజెక్టు ఉంది. అయితే ఇలా అన్ని కంపెనీలకు పులివెందుల లింకులుండడంతో వారి ఒప్పందాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోగలం.

దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలు సమ్మిట్ వైపు తొంగి చూడలేదు. ఒక్క రాజ్యసభ గిఫ్ట్ గా ఇచ్చారన్న కారణంతో ముఖేష్ అంబానీ తాను రావడమే కాదు. 14 మంది డైరెక్టర్లను వెంట బెట్టుకొని వచ్చి సదస్సుకు కాస్తా కళ నింపారు. కానీ టాటా, బిర్లాలు, మహేంద్రాలు ముఖం చాటేశారు. జన్యూన్ గా ఉండే ఏ పారిశ్రామిక వేత్తలు ఇటువైపు చూసేందుకు ఆసక్తికనబరచలేదు. కేవలం గత పరిచయాలు, పొలిటికల్ లింక్ లు ఉండే చిన్నపాటి కంపెనీలు, డొల్లతనం చూపించి హడావుడి చేసి ఒప్పందాలు చేసుకున్నాయన్న టాక్ వినిపిస్తోంది. గత రెండురోజులుగా సైలెంట్ గా సమ్మిట్ వ్యవహారాలను గమనించి విపక్షాలు, వ్యతిరేక మీడియాకు కావాల్సిన అస్త్రాలను జగన్ సర్కారు ఏరికోరి ఇచ్చింది. ఒప్పందం చేసుకున్న కంపెనీల పుట్టుపుర్వోత్తరాలు, వారి లావాదేవీలను శూల శోధన చేసే పనిలో వారు పడ్డారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular