
Jagan Bumper Offer: సంక్షేమ పథకాల అమలులో స్పీడు మీద ఉన్న ఏపీ సీఎం జగన్ మరో రెండు పథకాలకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తుతో పాటు వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను ప్రారంభించనున్నారు. అయితే ఇవి కేవలం పేదింట ఆడపిల్లలకు ఆర్థిక సాయానికే పరిమితం కాకూడదని జగన్ భావిస్తున్నారు. పేదింట పిల్లల చదువుల కొనసాగింపు, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల సంఖ్య పెంపు, డ్రాపౌట్స్ నియంత్రణ, బాలికల అక్షరాస్యత పెంపునకు పథకాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పుకొస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు తెల్ల రేషన్ కార్డు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చంద్రన్న పెళ్లికానుక కిందనగదు సాయమందించేవారు. కానీ ఈ సారి జగన్ సర్కారు కొన్ని మెలికలు పెట్టింది.
వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణత సాధిస్తేనే పథకం వర్తింపజేయనున్నట్టు తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ లెక్కన తప్పనిసరిగా ప్రతీఒక్కరూ తమ పిల్లలను పదో తరగతి వరకూ చదివిస్తారని లెక్క కడుతోంది. ఒక వేళ ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతి వరకూ చదివి డ్రౌపౌట్ గా ఉన్నా తిరిగి పాఠశాలలో చేరుతారని భావిస్తోంది. అటు బాలికా విద్య పెరుగుతుందని అంచనా వేస్తోంది. అయితే విపక్షాలు మాత్రం సర్కారు తీరును తప్పుపడుతున్నాయి. పేదల ఇంట ఆడపిల్ల పెళ్లికి ఇన్ని ఆంక్షలు అవసరమా అని ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు విధించడకుండా సాయం అందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకే విద్యార్హత తెరపైకి తెచ్చారని.. దానికి విద్యను ప్రోత్సహించడానికేనంటూ కలరింగ్ ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. అటువంటప్పుడు 300 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటితే పథకం ఎందుకు వర్తించదో చెప్పాలని డమాండ్ చేస్తున్నారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులైతే రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికుల వివాహానికి రూ.40 వేలు అందజేయనుంది. శనివారం నుంచి పథకం అమలులోకి రానుంది. సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ,ఇందుకు సంబంధించి వెబ్ సైట్ ను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు. నేడు రెండు పథకాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే గత మూడేళ్లుగా వివాహాలు చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చా? లేకుంటే ఇప్పటి నుంచి చేసుకున్న వారికి మాత్రమే పథకాలు వర్తిస్తాయా అన్నది మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అయితే అన్ని అర్హతలున్న వారికి మాత్రం రూ.లక్ష లబ్ధి చేకూరే అవకాశమైతే ఉంది.