Nagarjuna: గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో కూడా విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఎంపీ స్థానాలను టీడీపీ నిలబెట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ మూడు స్థానాలు జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నవే. వచ్చే ఎన్నికల్లో ఆ మూడు స్థానాలను గెలుపొందాలని జగన్ భావిస్తున్నారు. అయితే అందుకు సరైన అభ్యర్థుల అన్వేషణలో పడ్డారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ స్థానాన్ని ఎలాగైన కైవశం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో అయితే ఉన్నారు. ఇప్పటివరకూ డబ్బున్న పారిశ్రామికవేత్తలను రంగంలో దించినా ఫలితం లేకపోయింది. అందుకే డబ్బు, గ్లామర్ ఉన్న నాగార్జునను బరిలో దించనున్నట్టు ప్రచారం జరిగింది. కాదు కాదు అలా వైసీపీ సోషల్ మీడియా వింగ్ తో ప్రచారం చేయించారు. అనుకూల మీడియాలో కథనాలు వండి వార్చారు. కానీ నాగార్జున నుంచి ఎలాంటి ఫీలింగ్ బయటకు రాలేదు. ఆయన చాలా లైట్ గా తీసుకున్నారు. అయితే తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇటీవల ఓ సినీ ప్రమోషన్ లో భాగంగా నాగార్జున పొడిపొడిగా మాట్లాడారు. విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేస్తారన్న ప్రచారంపై నేరుగా స్పందించలేదు. అటువంటి గాసిప్స్ గత 15 ఏళ్లుగా వస్తున్న విషయాన్ని గుర్తుచేసి.. అటువంటిదేమీ లేదని చెప్పేశారు. దీంతో ఇదంతా ఉత్త ప్రచారంగా తేలిపోయింది. వైసీపీ ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చాలా రోజులుగా యోచిస్తోంది. కానీ ఎవరూ చిక్కడం లేదు. రాజధాని మార్పు విషయంలో విజయవాడ ప్రజలు వైసీపీ సర్కారుపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థిని దించి కనీసం పోటీ ఇవ్వాలన్న తలంపులో వైసీపీ అధిష్టానం ఉంది. నాగార్జున అయితే సినీ గ్లామర్ తో పాటు సామాజికవర్గ పరంగా లాభిస్తుందని అంచనా వేస్తోంది. అయితే యువ సామ్రాట్ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు.
జగన్ తనకు అత్యంత సన్నిహితుడని నాగార్జున తరచూ చెబుతుంటారు. వైసీపీ అధికారంలోకి రావాలని బలమైన ఆకాంక్ష నాగార్జునలో ఉందన్న ప్రచారం వైసీపీ ఆవిర్భావం నుంచే ఉంది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాగార్జున నేరుగా తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు వెళ్లి కలిసేవారు. కలిసే భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు టీడీపీకి వ్యతిరేకంగా జగన్ కు నాగార్జున ఆర్థిక వనరులు సమకూర్చారాని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. మ్యాట్రిక్స్ ప్రసాద్, జగన్, నాగార్జున వ్యాపార భాగస్వామ్యులు కూడా. ఈ నేపథ్యంలో నాగార్జునను రాజకీయాల్లోకి తెచ్చి విజయవాడ గెడ్డపై బరిలో దించాలని జగన్ స్కెచ్ వేశారు. కానీ నాగార్జున మాత్రం చిక్కలేదు. తనకు రాజకీయాలు సూటవ్వవని సుతిమెత్తగా తేల్చేశారు. దీంతో వైసీపీ అధిష్టానానికి విజయవాడ అభ్యర్థి అన్వేషణ తప్పలేదు.