ఆంధ్ర అల్లకల్లోలంగా ఉంది. తుఫానులు లేవు.. వర్షాలు లేవు.. భూకంపాలు అంతకన్నా లేవు.. సునామీ అవకాశామేలేదు.. కానీ రాజకీయ సునామీలో ఎత్తులు పైఎత్తులతో ఆంధ్రా రాజకీయాలు వేడెక్కాయి. దీనంతటికి కారణం ఇద్దరే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య యుద్ధమే రాష్ట్రంలో అనారోగ్య వాతావరణాన్ని సృష్టిస్తోంది..
పంతం నీదా నాదా? ఇగోల మధ్యపోటీతో ఆంధ్రాకు ఈ పరిస్థితి దాపురించింది. విధివిధానాలపై నిమ్మగడ్డ , జగన్ ల మధ్య యుద్ధం ఈ పరిస్థితికి కారణమైంది. ఇప్పుడు పరిస్థితి ఇంకా దిగజారింది.. నిమ్మగడ్డ , అధికార పార్టీల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. ఇరువర్గాలు సమస్యలను వ్యక్తిగతంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఒకరినొకరు ఆధిపత్యం చెలాయించడాని ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.
ఏపీ సర్కార్ తో జరిగిన ‘న్యాయ’ యుద్ధంలో విజయం సాధించి ప్రభుత్వంపై పైచేయి సాధించిన నిమ్మగడ్డ ఇక తనదే విజయం అని కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి వ్యవస్థలను కదిలిస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి చిన్న విషయాన్ని చాలా దూరం సాగదీయకుండా ఆయన సంయమనంతో వ్యవహరించాలి.
మార్చి 2020 నాటి పంచాయితీ ఎన్నికల వివాదంలో ఇద్దరు కలెక్టర్లు.. ఒక ఎస్పీని మార్చాల్సిన అవసరం లేనప్పటికీ వారిపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ పట్టుబట్టడం అధికారవర్గాల్లో నిజంగానే ఆగ్రహానికి కారణమైంది.
అదేవిధంగా ఈ దశలో పంచాయతీ రాజ్ విభాగంలో ఇద్దరు ఐఎఎస్ అధికారులను నిందించాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేస్తూ ఆయన జారీ చేసిన ఉత్తర్వు జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతోనే చేసిందని అందరూ భావిస్తున్నారు. దీన్ని నిమ్మగడ్డ అహంభావ స్వభావంగా అభివర్ణిస్తున్నారు.
“నిమ్మగడ్డ దృష్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పూర్తిగా పక్కకుపోయింది. అధికారులపై చర్యలు తీసుకోవడానికే తనకు అవకాశం చిక్కిందని చెలరేగిపోతున్నట్టు తెలుస్తోంది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి.. ఏ ఎస్ఈసీ ప్రవర్తించిన విధంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళుతున్నారు. దీంతో సహజంగానే ఇది వైయస్ఆర్సి నాయకుల నుంచి అతనిపై ఎదురుదాడికి దారితీస్తోందని విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు.