https://oktelugu.com/

రెండు కన్నీటిబొట్లు రైతు ఉద్యమాన్ని మలుపుతిప్పాయి

భారతదేశంలో సానుభూతికి వున్న శక్తి ఇంకే మంత్రానికి లేదు. జనవరి 26వ తేదీ ఘటనల తర్వాత రైతు ఉద్యమానికి మద్దత్తు తగ్గిపోయింది. ఒక్కరోజులో ఘజియాబాద్ దగ్గర ఘాజీపూర్ బోర్డర్ శిబిరంలోని రైతులందరూ తట్టాబుట్టా సర్దుకొని తిరుగు ప్రయాణమయ్యారు. 27 రాత్రి 9 గంటలకు కేవలం 100 మంది లోపే రైతులు మిగిలారు. అప్పటికే ఘాజీపూర్ బోర్డర్ లోనే ఉద్యమం నిర్వహిస్తున్న అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోర్దినేషన్ కమిటీ కన్వీనర్ విఎం సింగ్ రాకేశ్ తికాయత్ తీసుకున్న […]

Written By:
  • Ram
  • , Updated On : January 30, 2021 / 06:56 AM IST
    Follow us on

    భారతదేశంలో సానుభూతికి వున్న శక్తి ఇంకే మంత్రానికి లేదు. జనవరి 26వ తేదీ ఘటనల తర్వాత రైతు ఉద్యమానికి మద్దత్తు తగ్గిపోయింది. ఒక్కరోజులో ఘజియాబాద్ దగ్గర ఘాజీపూర్ బోర్డర్ శిబిరంలోని రైతులందరూ తట్టాబుట్టా సర్దుకొని తిరుగు ప్రయాణమయ్యారు. 27 రాత్రి 9 గంటలకు కేవలం 100 మంది లోపే రైతులు మిగిలారు. అప్పటికే ఘాజీపూర్ బోర్డర్ లోనే ఉద్యమం నిర్వహిస్తున్న అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోర్దినేషన్ కమిటీ కన్వీనర్ విఎం సింగ్ రాకేశ్ తికాయత్ తీసుకున్న తప్పుడు నిర్ణయంతో విభేదించి ఇంటిదారి పట్టాడు. ఇంకొద్ది గంటల్లో రాకేశ్ తికాయత్ శిబిరాన్ని ఎత్తేస్తాడని అందరూ అనుకున్నారు. పోలీసులు ఖాళీ చేయమని నోటీసు కూడా ఇచ్చారు. ఇంతవరకూ సీను ఒకలాగా వుంది. రాకేశ్ తికాయత్ 25వ తేదీ పోలీసులు, రైతు నాయకుల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించి 26వ తేదీ ఉదయం 8.30 గంటలకే ఘాజీపూర్ బోర్డర్ ని దాటి డిల్లీ లోపలకి ప్రవేశించాడు. దానిపై అప్పటిదాకా తనకు మద్దతిచ్చేవారు కూడా తన ప్రవర్తనని ఖండించారు. అందుకే ఇలా జరిగింది. కానీ ఇంతలోనే సీను మారింది. మీడియా రంగప్రవేశం చేసింది. కెమెరాలు, మైకులన్నీ రాకేశ్ తికాయత్ పైనే ఫోకస్ చేసాయి. ఇంకేముంది రాకేశ్ తికాయత్ ఉద్రేకానికి లోనయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను శిబిరం ఖాళీ చేయను. నన్ను కాల్చినా సరే నేను వెళ్ళను. అసలు మంచినీళ్ళు కూడా ముట్టను, చనిపోనైనా చనిపోతాను కాని నేను ఇక్కడనుంచి వెళ్ళను. ఇంకేముంది చానళ్ళు ఈ ఉద్రేక ప్రసంగాన్ని పదే పదే చూపించటంతో పాటు కావలసినంత మసాలా జోడించి ప్రసారం చేసారు, ఆ రాత్రంతా చేస్తూనే వున్నారు. ఒక్కసారి సీను రివర్స్ అయ్యింది. ముజఫర్పూర్ లో కిసాన్ మహాపంచాయత్ జరిగింది. ఎక్కడెక్కడ నుంచో రైతులు ఆ మహా పంచాయత్ కి వచ్చారు. అందరూ రాకేశ్ తికాయత్ కి సానుభూతి ప్రకటించారు. మరుసటిరోజు ఉదయం నుంచి తిరిగి రైతులు ట్రాక్టర్లలో ఘాజీపూర్ శిబిరానికి రావటం మొదలుపెట్టారు. రాత్రికి షుమారు 10 వేలమంది అక్కడికి చేరుకున్నారు. ఇంకేముంది మరుసటిరోజు ప్రతిపక్ష నాయకులందరూ పలోమని అక్కడ వాలిపోయారు. ఇంతకీ దీనికంతటికీ కారణం రెండు కన్నీళ్ళ చుక్కలు.

    అసలేవరీ తికాయత్ ?

    ఒక్కసారి సీను రివర్సు చేయండి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హర్యానాల్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువ. ఔరంగజేబుపై యుద్ధం చేసిన చరిత్ర కూడా వీళ్ళకు వుంది. ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడిన వర్గం ఈ జాట్లు. ఈ ప్రాంతంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్రామస్తులందరూ ఒకచోట కూర్చొని తీర్మానం చేయటం ఆనవాయితి. ఇటీవలికాలంలో ఖాప్ పంచాయతిలు ఇచ్చిన తీర్పులు వివాదాస్పదం కావటం కూడా చూసాం. ఉదాహరణకు కులాంతర వివాహం చేసుకున్నందుకు వాళ్లకు శిక్షలు వేసిన సంఘటనలు మనకు తెలిసిన విషయమే. రాజకీయపరంగా చూస్తే మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ వీళ్ళకు నాయకుడు. ఇది అందరికీ తెలిసిన చరిత్ర. కాని మన తెలుగువాళ్ళకి, కొత్త వాళ్లకి తెలియంది ఇంకోటి వుంది. రైతాంగ సమస్యలపై డిల్లీ నగరాన్ని బళ్ల ఊరేగింపుతో దిగ్భందనం చేసిన సంఘటనలు ఎన్నో వున్నాయి. అదీ రైతాంగ సమస్యలపైనే. దానికి నాయకత్వం వహించింది ఎవరోకాదు ఈ రాకేశ్ తికాయత్ నాన్న మహేంద్ర సింగ్ తికాయత్. జాట్లకు ఆయన అసలు సిసలు నాయకుడు. ఆయనంటే రైతులకు, ముఖ్యంగా జాట్లకు ఎనలేని అభిమానం. ఆధునిక చరిత్రలో రైతు ఉద్యమానికి ప్రతీక మహేంద్ర సింగ్ తికాయత్. ఆయన రక్తం పంచుకు పుట్టిన రాకేశ్ తికాయత్ అంటే అందుకే అంత అభిమానం. వాస్తవానికి పోయినసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అతి తక్కువ ఓట్లు వచ్చాయి. ఎన్నికలు వేరు, కుటుంబంపై అభిమానం వేరు. రాకేశ్ తికాయత్ కన్నీళ్లు పెట్టుకోవటం రైతులు చూడలేకపోయారు. ఆయన ఉద్రేకం ఒక్కసారి వాళ్లకు తికాయత్ కుటుంబం గుర్తుకొచ్చింది. జాట్ల ఆత్మ గౌరవం గుర్తుకొచ్చింది. అది బిజెపిపై కోపంగా మారింది. రాకేశ్ తికాయత్ ఒక్కడు కాదు మేమందరం ఆయన వెంట ఉన్నామని కదలి వచ్చారు. ఇదీ చరిత్ర.

    ఇంకొంచెం లోతులోకి వెళ్దామా?

    ఇంతకీ మహేంద్ర సింగ్ తికాయత్ రైతు విధానం ఏమిటి? ఈ దేశం రైతులమీద ఆధారపడింది. కాని వాళ్లకు న్యాయం జరగటం లేదు, పట్టణ వాసులకే ప్రభుత్వాలు అన్నీ సమకూరుస్తుంటాయి, రైతుల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోవటం లేదనేది. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలేదు, రైతులకు తగినంత సహాయం ప్రభుత్వాలు కల్పించటం లేదు, ఇవీ స్థూలంగా తన వాదనలు. ఇంకొంచెం లోతుకు వెళ్దాం. రైతులు తన పంటను ఎక్కడికైనా తీసికెళ్లే అధికారం వుండాలి. ప్రభుత్వ నిబంధనలు, నిర్బంధాలు వుండకూడదు అనికూడా ఉద్యమించాడు. నిజానికి ఇప్పుడు తీసుకొచ్చిన రైతు బిల్లులకి దగ్గరగా ఆయన సిద్ధాంతాలు వున్నాయి. అక్కడిదాకా ఎందుకు వాళ్ళ అబ్బాయి మనం మాట్లాడుకొనే రాకేశ్ తికాయత్ కూడా ప్రభుత్వం జూన్ లో ఆర్డినెన్సులు తీసుకొచ్చినప్పుడు కూడా వాటిని సమర్ధించాడు. ఆ ఆర్డినెన్సులు బిల్లులుగా ఆమోదించిన తర్వాత కూడా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి సమర్ధించినట్లుగా చెబుతారు. ఆ తర్వాత పంజాబ్ ఆందోళన ఉధృతమైన కొద్దీ తన ఆలోచనలో మార్పు వచ్చింది. ఉద్యమం డిల్లీకి చేరేటప్పటికే దీని పూర్తి చాంపియన్ గా రూపాంతరం చెందాడు. తను కమ్యూనిస్టుల రైతాంగ విధానానికి ఎప్పుడూ మద్దతిచ్చినవాడు కాదు. చౌదరి చరణ్ సింగ్ సిద్ధాంతానికి దగ్గరగా వున్న కుటుంబం. కాబట్టి ఇందులో పాల్గొంటున్న వాళ్ళు కుడి నుంచి ఎడమకు అన్ని సిద్ధాంతాల వాళ్ళు వున్నారు. సిక్కు స్వతంత్ర దేశం కావాలనే ఖలిస్తానుల దగ్గరనుంచి, మొత్తం ప్రభుత్వరంగం లోనే ఉండాలనే కమ్యూనిస్టుల దగ్గరనుంచి, అసలు ప్రభుత్వ అజమాయిషీ వద్దనే స్వతంత్ర సంఘాల వరకూ అందరూ ఇందులో భాగస్వాములయ్యారు. ఎవరి ప్రయోజనాలు వారివి. అయితే దీన్ని అవకాశంగా తీసుకొని అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలనే డిమాండుకి అందరూ ఒకటయ్యారు. ఇది వినటానికి బాగానే వున్నా ఆచరణ సాధ్యం కాదు. అంత డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవు. రైతు సంఘాలు దీన్ని వాళ్ళ కోరికగా నిజాయితీగానే కోరుకుంటున్నారు. కాకపోతే ఇందులో భాగస్వాములైన ఖలిస్తాను వాదులకి ఇది ముఖ్యం కాదు, దీన్ని అడ్డం పెట్టుకొని అలజడి సృష్టించాలి. కమ్యూనిస్టులకు కూడా తెలుసు. ఇది ఆచరణ సాధ్యం కాదని. కానీ దీనివలన మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయొచ్చని రాజకీయ కుట్ర. ఇక కాంగ్రెస్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు అధికారంలో వున్నప్పుడు చేయలేని పని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేయటం కేవలం మోడీని దెబ్బ తీయటానికే.

    ఇప్పట్లో పరిష్కారం వస్తుందా?

    చెప్పలేము. ఇంతవరకు ప్రధానంగా సిక్కు రైతులే ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. కాని ఇప్పుడు జాట్లు పూర్తిగా మద్దతివ్వటంతో ఉద్యమ స్వరూపం మారింది. ఒకవిధంగా ఇది రెండు నెలలు పంజాబ్ రైతులు సాధించలేనిది రెండు కన్నీటి బొట్లతో ఉద్వేగానికి లోనైన రాకేశ్ తికాయత్ సాధించాడని అనిపిస్తుంది. ఇంకొన్ని రోజులు పోతేగాని ఇది ఎలా మారుతుందో చెప్పలేము. నిన్న రాకేశ్ తికాయత్ కి మద్దతుగా కదిలిన రైతాంగం కేవలం తనకు మద్దతుగానేనా లేక ఈ రైతాంగ బిల్లులకు వ్యతిరేకంగానా అనేది తెలియాలి. అందుకే వచ్చే ఒకటి రెండు వారాల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుంది. రాకేశ్ తికాయత్ ఉదంతం లేకపోతే దీనిపని అయిపోయిందని అందరూ భావించారు. ముఖ్యంగా 26వ తేదీ జరిగిన ఘటనలతో పట్టణ ప్రజల మద్దతు కోల్పోయారని భావించవచ్చు. ఇంతవరకు పట్టణ ప్రజలు రైతాంగ ఉద్యమానికి సానుభూతి చూపించారు. ఇప్పుడు 26 తర్వాత కూడా హింసాత్మక ఘటనల్ని మరిచిపోయి అదే సానుభూతి చూపిస్తారా? ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండా ఎగరవేసిన తర్వాత కూడా ఇదే వైఖరితో ఉంటారా? చెప్పలేము. ఇప్పటికైతే ఈ ఎర్రకోట పై జెండా ఘటనలో ప్రతిపక్షాలు ముఖ్యంగా వామపక్ష వాదులు సోషల్ మీడియాలో ఇది ప్రభుత్వమే చేయించిందని చేసిన ప్రచారం కొంత సెక్షన్ లోకి వెళ్లినట్లుగానే అనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిజా నిజాలు బయటపెడితే గాని ఈ ప్రచారం కావాలని కుట్రపూరితంగా చేసారని పట్టణ ప్రజలందరూ నమ్మరు. పట్టణ ప్రజల సానుభూతి లేకుండా ఈ ఉద్యమాన్ని ఎక్కువకాలం కొనసాగించలేరు. అందుకనే కొద్దిరోజులు పోతేగాని దీని గతి, స్థితి తెలియదు. ప్రస్తుతానికి ఇది కొనసాగుతుంది. భారత దేశంలో కన్నీటి బొట్లకి, ఉద్వేగానికి వున్న శక్తి మరేదేనికి లేదని మరొక్కసారి ఈ సంఘటన నిరూపించింది.