AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. సంచలన తీర్పు వెలువరించింది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తిన సందర్భంలో రైతులు రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా తన ప్రయత్నాలు అమలు చేయాలని భావించింది. దీంతో విషయం కాస్త కోర్టుకు వెళ్లడంతో ఇవాళ వెలువరించిన తీర్పుతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
కోర్టులో ఎదురుదెబ్బలు తగలడం జగన్ కు కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా ఎన్నో కేసుల్లో కోర్టుతో చీవాట్లు తిన్న జగన్ తాజాగా జరిగిన పరిణామంతో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఎండగట్టింది. ప్రభుత్వ చర్యలను ఆక్షేపించింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Also Read: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో జితేందర్ రెడ్డి, డీకే అరుణ పేర్లు తెరపైకి? అసలు కథేంటి?
అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాజధాని పరిరక్షణ సమితి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలని సూచించింది. అక్కడి రైతులకు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలని చెప్పింది. ఆరు నెలల్లోగా చట్టప్రకారం పనులు జరగాలని అభిప్రాయపడింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందనని స్పష్టం చేసింది.
మూడు రాజధానుల వ్యవహారంలో కొత్త బిల్లులు తీసుకొస్తామని సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ చర్యలను ఆక్షేపిస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. అమరావతి విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చింది. దీంతో అమరావతి రాజధానిగా చేస్తూ దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది.
రాజధానిని మార్చాలనే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని సూచించింది. రాజధానిని మూడు భాగాలుగా చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెంప చెల్లుమనిపించింది. దీంతో ప్రభుత్వ ఒంటెత్తు పోకడలను తప్పుబట్టింది. అయినా ప్రభుత్వంలో మార్పు లేకపోవడంతోనే కోర్టు ఈ మేరకు స్పందించింది. రాజధాని విషయంలో సరైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి చురకలు అంటించింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకే పని చేయాలని చెప్పడంతో సర్కారుకు హెచ్చరికలు జారీ చేసినట్లయింది.
రాజధాని భూములను తనఖా పెట్టడానికి కూడా వీలు లేదని తెలుస్తోంది. దీంతో భవిష్యత్ లో అమరావతి విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఇతర నిర్ణయాలు తీసుకోరాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రాజధానుల వ్యవహారం కూడా సరైంది కాదని సూచించింది. దీంతో రాబోయే రోజుల్లో అమరావతిని డెవలప్ చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది. ఆరు నెలల్లో రాజధానికి అన్ని హంగులు సమకూర్చాలని తీర్పు వెలువరించింది.