అల‌ర్ట్ః మిస్డ్ కాల్ తో.. మీ ఫోన్ హ్యాక్‌!

టెక్నాల‌జీ ఎంత‌గా పెరుగుతోందో.. దానివ‌ల్ల విధ్వంసం కూడా అంతే పెరుగుతోంది! సౌక‌ర్యం, లాభం ఎంతుందో.. దాంతో న‌ష్టం కూడా అంతే ఉంటోంది! ఇది వ‌ర‌కు ఇద్ద‌రు మ‌నుషులు మాట్లాడుకునే విష‌యాన్ని వినాలంటే.. మూడో మ‌నిషి ఆ ప్రాంతంలో ఉండాలి. ఏ గోడ‌మాటునో.. ఏ చెట్టు చాటునో ఉండి వినాలి. కానీ.. ఇప్పుడు అలా అవ‌స‌రం లేకుండా పోయింది. గుట్టుచ‌ప్పుడు కాకుండా.. అత్యంత సీక్రెట్ గా ఫోన్లో మాట్లాడుకున్న మాట‌లు కూడా.. ఎక్క‌డో ఉన్న‌వాడు పూస‌గుచ్చిన‌ట్టు వింటున్నాడు. అంతేనా..? […]

Written By: Bhaskar, Updated On : July 20, 2021 9:22 am
Follow us on

టెక్నాల‌జీ ఎంత‌గా పెరుగుతోందో.. దానివ‌ల్ల విధ్వంసం కూడా అంతే పెరుగుతోంది! సౌక‌ర్యం, లాభం ఎంతుందో.. దాంతో న‌ష్టం కూడా అంతే ఉంటోంది! ఇది వ‌ర‌కు ఇద్ద‌రు మ‌నుషులు మాట్లాడుకునే విష‌యాన్ని వినాలంటే.. మూడో మ‌నిషి ఆ ప్రాంతంలో ఉండాలి. ఏ గోడ‌మాటునో.. ఏ చెట్టు చాటునో ఉండి వినాలి. కానీ.. ఇప్పుడు అలా అవ‌స‌రం లేకుండా పోయింది. గుట్టుచ‌ప్పుడు కాకుండా.. అత్యంత సీక్రెట్ గా ఫోన్లో మాట్లాడుకున్న మాట‌లు కూడా.. ఎక్క‌డో ఉన్న‌వాడు పూస‌గుచ్చిన‌ట్టు వింటున్నాడు. అంతేనా..? మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న ఫోన్లో ఉన్న ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ లిస్ట్.. ఒక్క‌టేమీటీ స‌ర్వం మ‌న ఫోనే వాడి ఆధీనంలోకి వెళ్లిపోతోంది. భౌతికంగా ఫోను మాత్ర‌మే మ‌న చేతుల్లో ఉంటుంది.. మ‌న స‌మాచారం మొత్తం వాడి చెంత‌కు చేరిపోతోంది. ఇంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ల‌లో అత్యంత డేంజ‌ర్ గా ఉంది ఇజ్రాయిల్ కు చెందిన ‘పెగాస‌స్’ సాఫ్ట్ వేర్. మరి, అది ఎలా చొరబడుతుంది? దానికి ఏం చేయాలి? అన్న‌ది చూద్దాం..

స‌హ‌జంగా.. హ్యాకింగ్ సాప్ట్ వేర్స్ మ‌న‌తో త‌ప్పు చేయించి, మ‌న ఫోన్లోకి ప్ర‌వేశిస్తాయి. ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఒక లింక్ ను మెసేజ్ రూపంలో పంపిస్తారు. అది ఓపెన్ చేస్తే చాలు.. ఆ వైర‌స్ మ‌న ఫోన్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ త‌ర్వాత ఫోను మొత్తం హ్యాక‌ర్ చేతిలోకి వెళ్లిపోతుంది. అప్ప‌టి నుంచి ఫోన్లో ఉన్న స‌మాచారం మొత్తం హ్యాక‌ర్ సేక‌రిస్తుంటాడు. ఇందులో కాంటాక్ట్ లిస్టు మొద‌లు ప్ర‌తీ డేటాతోపాటు చివ‌ర‌కు ఫోన్ కాల్స్ కూడా అవ‌త‌లి వ్య‌క్తి వింటాడు. అయితే.. ఇది పాత ప‌ద్ధ‌తి.

ఇజ్రాయెల్ కు చెందిన ఈ స్పైవేర్ టూల్ పెగాస‌స్ మాత్రం ఇలా చేయ‌దు. ఇది అడ్వాన్స్డ్ వెర్ష‌న్. అస‌లు మ‌నం ఎలాంటి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌కున్నా.. ఎలాంటి పొర‌పాటూ చేయ‌కున్నా.. మ‌న ఫోన్లో దూరిపోతుంది. మొత్తం హ్యాక్ చేసి ప‌డేస్తుంది. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ పెగాస‌స్ స్పై సాఫ్ట్‌వేర్ ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. మ‌న దేశానికి సంబంధించి 2019లోనే ఈ మోసం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది.

అయితే.. ఇప్పుడు లేటెస్ట్ వ‌ర్ష‌న్ ప్ర‌కారం.. ఈ పెగాస‌స్ ఎవ‌రి ఫోన్లోకి కావాల‌న్నా.. వారి అనుమ‌తి లేకుండానే చేరిపోతుంది. కేవ‌లం ఒక వీడియో మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ హ్యాక్ చేస్తుంది! అంటే.. ఎవ‌రి ఫోన్ హ్యాక్ చేయాల‌ని భావిస్తున్నారో.. వారి ఫోన్ నంబ‌ర్ తెలిస్తే స‌రి. ఓ వీడియో మిస్డ్ కాల్ ఇచ్చేస్తారు. అంతే.. ఆ కాల్ లిఫ్ట్ చేసినా.. చేయ‌కున్నా.. ఆ సాఫ్ట్ వేర్ ఆ ఫోన్లో చేరిపోతుంది. అంతే.. అప్ప‌టి వ‌ర‌కు అందులోని స‌మాచారాన్ని, ఆ త‌ర్వాత ఫోన్లో స్టోర్ అయ్యే డేటా మొత్తాన్నీ చోరీ చేసేస్తుంది.

ఈ సాఫ్ట్ వేర్ మ‌న ఫోన్లో చేరింద‌ని, మ‌న ఫోన్ హ్యాక్ అయ్యింద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలియ‌దు. అయితే.. కొద్దిగా ఫోన్ స్లో అయినట్టు అనిపించ‌డంతో దుబాయ్ కు చెందిన హ‌క్కుల కార్య‌క‌ర్త అహ్మ‌ద్ మ‌న్సూర్ అనుమానించ‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగు చూసింది. అయితే.. ఈ సాఫ్ట్ వేర్ ఒక్క‌సారి ఫోన్లో చేరితో ఇక ఏమీ చేయ‌లేమ‌ని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ మార్చేసి, పాస్ వ‌ర్డులు మార్చుకోవ‌డం మిన‌హా.. చేయ‌గ‌లిగింది ఏమీ లేద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ సాఫ్ట్ వేర్ ను ప్ర‌భుత్వాలు మాత్ర‌మే వినియోగిస్తుంటాయ‌ని అంటున్నారు. ఇదే విష‌య‌మై.. విప‌క్షాలు కేంద్ర ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు కూడా చేశాయి. చేస్తున్నాయి. అయితే.. కేంద్రం మాత్రం త‌మ‌కు సంబంధం లేద‌ని చెబుతోంది. అయితే.. చ‌ట్ట‌బ‌ద్ధంగా ప్ర‌భుత్వాలు అవ‌స‌ర‌మైన వారి ఫోన్లు ట్యాప్ చేస్తాయి. కానీ.. అన‌ధికారికంగా ఇలా చేయ‌డం మాత్రం నేర‌మ‌ని భార‌త టెలిగ్రాఫ్ చ‌ట్టం, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం చెబుతున్నాయి.