India Afghanistan friendship: ఇన్నాళ్లూ పాకిస్తాన్‌కు మిత్ర దేశంగా ఉన్న ఆఫ్గానిస్తాన్.. సడెన్‌గా ప్లేట్ ఫిరాయించింది. ఇప్పుడు భారత్‌తో బంధం బలోపేతం చేసుకుంటోంది. ఇక తాము ఎంత చెబితే ఆఫ్టాన్ అంత అనుకున్న పాకిస్తాన్‌కు ఈ మైత్రి మింగుడు పడడం లేదు. మరోవైపు అఫ్గాన్ తాలిబన్ విదేశాంగ మంత్రి ఇటీవల భారత్ పర్యటించటం ఆసియా రాజకీయ విన్యాసాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ‘‘భారత్ అంటే ప్రాణం ఇస్తాం’’ అనే తాలిబన్ వర్గాల వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై కొత్త ఊహాగానాలకు తెరతీశాయి.
ఏళ్లుగా పెట్టుబడి…
భారతదేశం గత రెండు దశాబ్దాల్లో అఫ్గానిస్తాన్‌లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్య రంగాల్లో భారీ వనరులు ఖర్చు చేసింది. సల్మా డ్యామ్, జారంజ్–డెలారమ్ హైవే, పార్లమెంట్ భవనం వంటి ప్రాజెక్టులు దేశ నిర్మాణంలో కీలకంగా నిలిచాయి. తాలిబన్ పాలన ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టులు, పెట్టుబడులకు భవిష్యత్తులో భద్రత సవాలు కావొచ్చని ఆందోళన. విశ్లేషకుల మాటలో, తాలిబన్‌తో కనీస అవగాహన లేకపోతే ఈ పెట్టుబడి ఫలప్రదం కాకపోవచ్చు.
తాలిబన్ వైఖరి మార్పేనా..
పూర్తి శత్రుత్వ ధోరణి నుంచి, భారత్‌పై సానుకూల వ్యాఖ్యలకు తాలిబన్ మారడం రెండు కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. చైనా, పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలను బలపరుస్తూనే, భారత్‌ను పూర్తిగా దూరం చేయకూడదన్న జాగ్రత్త. అంతర్జాతీయ గుర్తింపు కోసం భారత్‌తో సంభాషణ, మౌలిక సదుపాయాలైన వాణిజ్య మార్గాలను తెరవాలనే అవసరం. ఇది నిజమైన మార్పా, లేక సమయం గడిపే వ్యూహమా అనే ప్రశ్న తెరపై ఉంది.
భారత్ కోసం అవకాశాలు..
తాలిబన్‌తో సంబంధాలు మెరుగుపరచడం ద్వారా గత పెట్టుబడులకు రక్షణ, మధ్యాసియాకు వాణిజ్య మార్గం, ఉగ్రవాద భయాంశాలను తగ్గించే అవకాశం ఉంది.
అయితే, అంతర్జాతీయ వేదికలలో మానవ హక్కులు, మహిళా స్వేచ్ఛ, విద్యా వంటి అంశాలపై భారత్ నిశితంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఆసియా శక్తిగా..
భారత్–తాలిబన్ మధ్య సంభాషణ, చైనా–పాకిస్తాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఒక వ్యూహాత్మక ప్రయత్నం కావొచ్చు. ఇంకా, రష్యా, ఇరాన్, మధ్యాసియా దేశాల ప్రయోజనాలను సమన్వయం చేస్తూ, ప్రాంతీయ శక్తి సమీకరణల్లో భారత్ తన స్థానాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తాలిబన్ నుంచి వచ్చిన ‘‘భారత్ అంటే ప్రాణం ఇస్తాం’’ అన్న సందేశం, కేవలం రాజకీయ పద్ధతినే కాక, గత పెట్టుబడుల భవిష్యత్తును కాపాడే ఒక అవకాశంగా చూడవచ్చు. అయితే, వ్యూహాత్మక ప్రయోజనాలు, మానవ విలువల మధ్య సమతుల్యం సాధించడం భారత్ దౌత్యానికి పెద్ద పరీక్షగా మారుతోంది.