
2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీకి ఆయుధం దొరికిందా? ఆ వ్యూహం ఇప్పటి నుంచే అమలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో కేంద్రంలోని బీజేపీ పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో.. మోడీ ప్రతిష్ట పూర్తిగా మసకబారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్లోబల్ సర్వే సంస్థలు కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దీంతో.. వచ్చే ఏడాది ఎలాంటి వ్యూహంతో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ఇప్పటి నుంచే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
గత పార్లమెంట్ ఎన్నికల వేళ పాకిస్తాన్ ను ప్రధాన ఆయుధంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. దేశభక్తి అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకున్న కమలదళం.. ఇదే విషయాన్ని ప్రచారం చేస్తూ ఎన్నికలకు వెళ్లింది. అభివృద్ధి, ఇతరత్రా అంశాలు ఉన్నప్పటికీ.. పాకిస్తానే కీలక అంశంగా ఉంది. ఈ అస్త్రాలతోనే అఖండ విజయం సాధించింది బీజేపీ. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు సైతం ఇలాంటి ఎజెండానే రూపొందిస్తున్నట్టు సమాచారం.
అయితే.. ఈ సారి పాకిస్తాన్ కాకుండా.. చైనాను ఎంచుకుంటున్నట్టు సమాచారం. బెంగాల్ బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ ఈ మేరకు ప్రకటన కూడా చేసేయడం గమనార్హం. 2024లో జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఓడించడానికి చైనా కుట్ర పన్నిందని, ఆ కుట్రను భారతీయులందరూ ఛేదించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రకటించడం గమనార్హం. దీంతో.. వచ్చే ఎన్నికల వ్యూహం ఇదేనని తేలిపోయిందని అంటున్నారు పరిశీలకులు.
ఇంతేకాదు.. కరోనా సెకండ్ వేవ్ భారత్ లో పెరిగిపోవడానికి కూడా చైనా పన్నాగమే కారణమట! ఈ కారణంగానే ఆసియాలో ఏ దేశంలో లేని తీవ్రత ఇండియాలో ఉందట. దీన్నిబట్టి.. ఇక, రాబోయే మూడేళ్లలో ఈ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోందని అంటున్నారు. మరి.. ఈ ఫార్ములా ఏ మేరకు వర్కవుట్ కానుందో చూడాలని అంటున్నారు.