
భారతీయ జనతా పార్టీకి బలం పెరుగుతోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ ఈనెల 14న ఢిల్లీకి వెళుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఈటల చేరికతో బీజేపీలో కొత్త ఉత్సాహం వికసించనుంది. దీంతో బీజేపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం రానుంది. ఈటల రాజేందర్ రాకతో నేతల్లో సమరోత్సాహం పెరగనుంది.
ఈ విషయంలో బీజేపీ లాటరీ కొట్టినట్లే అనే ప్రచారం సాగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, జిల్లాపరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమతోపాటు మరి కొందరు కూడా బీజేపీలో చేరబోతున్నారు. ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వత్థామరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో ఒకే సారి ఇంత మంది ఎప్పుడు చేరలేదు. గతంలో కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కొందరు సీనియర్లు బీజేపీలో చేరినా వారంతా విడివిడిగా చేరారు. అంతేకాని ఒకేసారి ఐదారు మంది సీనియర్ నేతలు కమలం పార్టీలో చేరిన సందర్భాలు లేవు. ఈటలతోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ గట్టి నేతలుగా పేరున్న వాళ్లనే చెప్పాలి.
కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న వారంతా బీజేపీలో చేరడానికి సమాయత్తమవుతున్నారు. ఈటల రాజీనామా ద్వారా ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూడాల్సిందే. ఈ ఎన్నికలో ఈటల మళ్లీ గెలిస్తే కేసీఆర్ వ్యతిరేకులంతా స్పీడవుతారు. లేకపోతే కేసీఆర్ జోరే కంటిన్యూ అవుతుంది.