
AP Global Investors Summit 2023: మూడున్నరేళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని జగన్ సర్కారు చెరిపేసింది. ఉన్న పరిశ్రమలను తరిమికొట్టింది. అసలు ఏపీలో పారిశ్రామికాభివృద్ధే లేదన్న విమర్శ సర్వత్రా వ్యాపించింది. ఇది మరింత ముదిరితే తాను మునగడం ఖాయమని భావించిన జగన్ ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ కూడా అంకెల గారడీ చూపిస్తున్నారు. ఏకంగా 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని.. ఒప్పందాలు కూడా పూర్తయ్యాయని చెప్పుకొస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. రెండు లక్షల కోట్లు వస్తాయంటే.. ఏకంగా 13 లక్షల కోట్లకు పెట్టుబడులు చేరాయని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వేళ కొత్త జిమ్మిక్కులు తెరపైకి తెచ్చి ప్రజలు పాత వాటిని మరిచిపోయేలా చేయడమే టాస్క్ గా పెట్టుకున్నారు.
విశాఖ ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. తొలిరోజు రూ.11.5 లక్షల కోట్లకు సంబంధించి పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో విద్యుత్ రంగానికి సంబంధించి రూ.8.5 లక్షల కోట్లు ఉండడం విశేషం. రాష్ట్రంలో పది వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది చాలదన్నట్టు బయట నుంచి మరో వెయ్యి మెగావాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవసరాలకు మించి పవన, సౌర విద్యుత్ సంస్థలతో రాష్ట్ర ఇంధన పంపిణీ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 4000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందాలు చేసుకోగా.. తాజాగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అడ్డంపెట్టుకొని మరో 7000 మెగావాట్ల విద్యుత్ ను అదానీ నుంచి కొనుగోలుకు వైసీపీ సర్కారు నిర్ణయించింది. దీనికి యూనిట్ కు రూ.2.94 చెల్లింపులు చేస్తోంది. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజాగా సమ్మిట్ లో మరో 8.35 లక్షల కోట్ల ఒప్పందాలను విద్యుత్ ఉత్పత్తిరంగంలో చేసుకోవడం గమనార్హం. ఇప్పుడున్న గణాంకాల ప్రకారం ఒక్కో మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 కోట్లు అవసరం. ఈ లెక్కన రూ.8.5 లక్షల కోట్లతో 1,67,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించవచ్చు. అయితే ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ ను ఎక్కడ నిల్వ చేస్తారన్నది ప్రశ్న. రాష్ట్రంలో రోజు వారి విద్యుత్ వినియోగం పదివేల మెగావాట్లు అయితే లక్షల మెగావాట్ల విద్యుత్ ను ఏం చేస్తారు? ఎక్కడుస్తారు? ఇవి వాస్తవాలకు దగ్గరగా ఉన్న ఒప్పందాలేనా? లేక ఏదో చేశామని చెప్పేందుకా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూమి అవసరం. ఇన్వెస్టర్ సమ్మిట్ కు ముందు ఏపీలో 80 వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కానీ ఒక్క విద్యుత్ సంస్థలకే మూడు లక్షల 75 వేల ఎకరాల భూములు అవసరం. మరి ఇతర పరిశ్రమల మాటేమిటి? అన్నదానిపై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు.
విద్యుత్ రంగంలో 8.5 లక్షల కోట్లు ఒప్పందాలు జరగగా.. అందులో ఎన్టీపీసీదే సింహభాగం. రూ.2.35 లక్షల కోట్ల వాటా ఆ సంస్థదే. దీనికి కూడా జగన్ సర్కారు వక్రభాష్యం చెబుతోంది. ఎన్టీపీసీతో తాజా ఒప్పందాలతో ఏకంగా 77 వేల ఉద్యోగాలు వస్తాయని లెక్కలు చెబుతోంది. అయితే ఎన్టీపీసీది సుదీర్ఘ చరిత్ర. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర దాని సొంతం. రూ.3,98,966 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 20 వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 20 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. తాజా ఒప్పందం ప్రకారం ఏపీలో నాలుగు రెట్ల పెట్టుబడులు పెట్టగలదా? ఇప్పుడున్న ఉద్యోగులకు మించి మరో 77 వేల ఉద్యోగాలను భర్తీ చేయగలదా? ఈ గణాంకానికే నాలుగున్నర దశాబ్దాలు పడితే ఏపీ చెబుతున్న కాకి లెక్కలు అమలుచేయడానికి ఎన్నిరోజులు పడుతుందన్నది ప్రశ్న.
ఇతర రంగాల్లో పెట్టుబడులు కూడా దాదాపు పాతవే. వాటినే తిరగరాసి ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటించారు. రిలయన్, అదాని, ఆదిత్యబిర్లా,అరబిందో, జిందాల్, ఐవోసీఎల్, మోండలీస్, పార్లే, శ్రీ సిమెంట్ తదితర కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించడంతో పాటు కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి ఒప్పందాలు చేసుకున్నాయంటూ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇందులో ఆదిత్యా బిర్లా గ్రూప్ గత ప్రభుత్వ హయాంలోనే పులివెందులలో రూ.110 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. సెంచురి ప్లైవుట్ కంపెనీతో ఒప్పందం కూడా పాతదే. దాదాపు పాత ఒప్పందాలను తిరగరాసి సరికొత్త గణాంకాలను సీఎం జగన్ చదివి వినిపించారు. అంతకు మించి ఏమీ లేదు. కానీ వైసీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం జగన్ ఫొటో జతచేసి కనివినీ ఎరుగని రీతిలో పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ తెగ హడావుడి చేస్తోంది.