TDP Social Media Strategy: రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా కీలకంగా మారింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇన్నేళ్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేనేజ్ చేస్తూ వచ్చిన టీడీపీకి సోషల్ మీడియా కంటకంగా మారింది. అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ సోషల్ మీడియా పనితీరు అంతంత మాత్రమే అని చెప్పాలి. సీబీఎన్ ఆర్మీ పేరుతో అప్పట్లో సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు యాక్టివ్ గా ఉండేవారు. కానీ వైసీపీ సోషల్ మీడియా ముందు సీబీఎన్ ఆర్మీ తేలిపోయింది. ఫలితంగా పెద్ద ఎత్తున నష్టాన్ని మూటగట్టుకుంది.

గత అనుభవాలు నేర్పిన గుణపాఠంతో టీడీపీ సోషల్ మీడియా సైన్యం నిర్మిస్తోంది. ఐ టీడీపీ పేరుతో కొత్త విభాగాన్ని ప్రారంభించింది. మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ నేతృత్వంలో ఐటీడీపీ కొనసాగుతోంది. ఇటీవల చింతకాయల విజయ్ తో పాటు, ఐటీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసు కేసులను ఎదుర్కొన్నారు. ఐటీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. గతానికి భిన్నంగా సోషల్ మీడియా పై టీడీపీ దృష్టి పెట్టింది.
చింతకాయల విజయ్ నేతృత్వంలో సాగుతున్న ఐటీడీపీకి మరో ఇద్దరు కీలక నేతల్ని సలహాదారులుగా నియమించింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తో పాటు టీడీపీ నేత జీవీ రెడ్డిని సలహాదారులుగా బాధ్యతలు అప్పగించింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా ప్రభావవంతంగా పనిచేసింది. చంద్రబాబు పై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఫలితంగా ఎన్నికల్లో వైసీపీ వైపు ప్రజలు మొగ్గు చూపేలా ఫలితం సాధించింది.

వైసీపీ సోషల్ మీడియా చూపిన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ అదే బాటలో పయనిస్తోంది. సోషల్ మీడియాలో బలంగా టీడీపీ వాణి వినిపించగలిగితే ప్రజల్లో పాజిటివ్ టాక్ తీసుకురావొచ్చనే ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది. ఇందులో భాగంగానే పయ్యావుల కేశవ్, జీవి రెడ్డిలకు ఐటీడీపీ బాధ్యతలు ఇచ్చింది. దీనికి తోడుగా ప్రముఖ వ్యూహకర్త రాబిన్ శర్మ టీమ్ ఐటీడీపీకి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తోంది. ఎలాంటి కంటెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశం పై ఐటీడీపీ సభ్యులకు తర్ఫీదు ఇస్తోంది.