Ponguleti Srinivasa Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతారని భావిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆయన అనుచరుడు, సత్తుపల్లి నియోజకవర్గంలో కీలక నాయకుడు మట్టా దయానంద్ విజయ్ కుమార్ బిజెపిలో చేరేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆయన అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు.

కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు..
మట్టా దయానంద్ విజయ్ కుమార్ బిజెపిలో కాకుండా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.. భారతీయ జనతా పార్టీకి స్థానికంగా బలం లేకపోవడం, మైనార్టీ, క్రిస్టియన్ ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడే అవకాశం లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే గత కొద్ది రోజులుగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి శిబిరానికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి మట్టా దయానంద్ తో పలుమార్లు చర్చలు జరిపినట్టు సమాచారం.. సత్తుపల్లి టికెట్ మట్టా దయానంద్ కే ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
పొంగులేటి కిం కర్తవ్యం
పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2014లో రాజకీయంగా అరంగేట్రం చేశారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు. అదే సమయంలో వైరా నుంచి మదన్ లాల్, అశ్వరావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు.. సత్తుపల్లి అభ్యర్థిగా మట్టా దయానంద్ విజయకుమార్ పోటీ చేశారు.. కానీ స్వల్ప ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య మీద ఓడిపోయారు. అయితే మట్టా దయానంద్ విజయకుమార్ అప్పటినుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తోనే కొనసాగుతున్నారు.

భారత రాష్ట్ర సమితితో విభేదాలు తలెత్తడంతో..
అయితే ఇటీవల భారత రాష్ట్ర సమితితో విభేదాలు తలెత్తడంతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వ్యతిరేక స్వరం వినిపించారు. అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో టచ్ లో ఉన్నారు.. తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని పొంగులేటి కోరినట్టు సమాచారం.. ఈ నేపథ్యంలో పొంగులేటి వర్గంతో వెళ్లలేక మట్టా దయానంద్ విజయ్ కుమార్ వెనక్కి మళ్ళినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. అటు భారతీయ జనతా పార్టీలో చేరకముందే పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఈ రకంగా షాక్ తగలడం నిజంగా ఊహించని పరిణామమే.