ప్రత్యేక హోదా అంశం ఎప్పుడు ఎన్నికల నినాదంగా మారుతోంది. ప్రతిసారి రాజకీయ పార్టీలకు ఆయుధంగా కనిపించే ప్రత్యేక హోదాపై ఈసారి కూడా వైసీపీ తన అమ్ములపొదిలో పెట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే దాన్ని నిలువరించడం ఎలా అనే అంశంపై ఇతర పార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి.2014 ఎన్నికల్లో ఈ నినాదంతోనే టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించగా2019 ఎన్నికల్లో వైసీపీ విక్టరీ కొట్టింది.ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా మరోసారి ఎన్నికల నినాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా అన్న అంశం రాజకీయ పార్టీలకు ఎన్నికల సరకుగా మారింది. ఎన్ని సార్లు వాడినా మళ్లీ కొత్తగా అనిపిస్తూ వాటికి అధికారం కట్టబెడుతూ తనలోని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ప్రస్తుతం దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ ఎదగకుండా టీడీపీ గూటికి చేరకుండా చేసే ఉద్దేశంతో వైసీపీ ప్రత్యేక హోదా ఎత్తుగడ ఉపయోగించుకోవాలని చూస్తోంది. ప్రత్యేక హోదా హక్కులు మావేనని వైసీపీ భావిస్తోంది.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏమి మాట్లాడడం లేదని జగన్ సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్లలో ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం పెడచెవిన పెడుతోందని విమర్శించారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా విషయంలో ఎక్కడా తగ్గేది లేదని చెబుతున్నారు. వైసీపీకి ప్రత్యేక హోదా ప్రాముఖ్యతపై స్పష్టం చేశారు. చంద్రబాబుకు మోడీ అంటే భయమని, మాకు మాత్రం లేదని చెప్పారు.
ప్రత్యేక హోదా అంశాన్ని ఎవరు వదిలేసినా తాము వదలమని స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ నాయకులు మాత్రం దీని గురించి మాట్లాడడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దీనిపై ఎక్కడ పెదవి విప్పడం లేదు. జనసేన పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై మొదట్లో ప్రశ్నించినా తరువాత సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం వైసీపీని గట్టెక్కిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. అయినా వైసీపీ మాత్రం ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్తుందని పార్టీ వర్గాలు చెబతున్నాయి.