Revanth Reddy: తానోటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణలో బీహార్ అధికారుల హవాపై విమర్శలు చేశారు. దీనికి ప్రతిపక్షాలు కౌంటర్ ఇవ్వాల్సింది పోయి సొంత పార్టీ వారే రేవంత్ కు కౌంటర్ ఇస్తున్నారు. సొంత పార్టీలోనే వేరు కుంపటి కాంగ్రెస్ కు కొత్తేమీ కాదు. గతంలో కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్లే ఎదురు తిరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టమేనని తెలిసిపోతోంది.
అసమ్మతి రాగం పార్టీలోనే రావడంతో రేవంత్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే సీనియర్ నేతలే ఆయనకు చెక్ పెడుతున్నారు. ఫలితంగా ఆయన మాట్లాడింది తప్పుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో సహజంగానే రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఐఏఎస్ అధికారుల విషయంలో రేవంత్ మాట్లాడిన మాటలపై వీహెచ్, మధుయాష్కీ గౌడ్ స్పందించి వారు కూడా మన దేశంలోని వారే అని కౌంటర్ ఇవ్వడంతో రేవంత్ ప్రతిష్ట తుస్సుమంది.
కాంగ్రెస్ లో ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు సాగనివ్వడం లేదు. ఏదో ఉన్న విషయాన్ని సూటిగా చెబితే కూడా అది కరెక్టు కాదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆక్షేపించడంతో రేవంత్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. సొంత పార్టీలోనే అసమ్మతి ఉంటే ఇక ఏం చేయాలని ఆలోచనలో పడిపోయారు. పార్టీని గట్టెక్కించడం కష్టమే అని తేలిపోతోంది.
మనం మాట్లాడే మాటలకు ఇతర పార్టీలు విమర్శిస్తే సరే కానీ మన వారే విమర్శలు చేయడంతో డైలమాలో పడుతున్నారు. కాంగ్రెస్ ను గాడిలో పెట్టడం అంత సులువు కాదని తేలిపోతోంది. రానున్న ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకడం కూడా సులభం కాదని తెలిసిపోతోంది. సొంత పార్టీ వారే పరాయి పార్టీ వారు మాట్లాడినట్లుగా భావిస్తున్నారు.
మొత్తానికి బీహార్ ఐఏఎస్ అధికారుల అంశంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. రాజకీయం చేయడం కాంగ్రెస్ నాయకులకు చేతకాదనే విషయం బోధపడుతోంది. సీనియర్ నేతల అత్యుత్సాహమే రేవంత్ రెడ్డికి ఆశనిపాతంగా తాకుతోంది. ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్లకుండా నిరోధించడంలో కాంగ్రెస్ వారికి వారే పోటీ. వారికి ఎవరు లేరు సాటి అన్నట్లుగా వారి బాగోతం సాగుతోంది.