KCR- Governor Tamilisai: రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవి ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రాష్ట్రంలో గవర్నర్ పేరుతో సాగే పాలనలో రాజకీయ పార్టీలు వారి పాత్రను అపవిత్రం చేస్తున్నాయి. సొంత విధానాలు అమలు చేస్తూ తాము సూచించిన అంశాలనే చదవాలని పట్టుబడుతున్నాయి. ఫలితంగా గవర్నర్ కూడా రాష్ట్రపతి మాదిరి కీలుబొమ్మలా మారుతున్నారు. లేదంటే సీఎంలు వారిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా వారి మధ్య సైతం పొరపొచ్చాలు చోటుచేసుకోవడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్ లో కూడా గతంలో గవర్నర్ కు సీఎం మమతా బెనర్జీకి కుదరక వారి విభేదాలు తారాస్థాయికి చేరడం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో కూడా గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ కు సీఎం కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిపోతోంది. తాము సూచించిన దాన్ని కాకుండా గవర్నర్ సొంత పదాలను వాడుతూ ప్రసంగం చేస్తున్నారనేది టీఆర్ఎస్ నేతల అభియోగం.
Also Read: రేవంత్ రెడ్డికి సొంత పార్టీ వారి నుంచే ముప్పు?
గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగంలో ప్రభుత్వం సూచించిన అంశాలను కాకుండా ఇతర అంశాలు చదివారని కేసీఆర్ చెబుతున్నారు. అంతేకాకుండా జనవరి 26 సందర్భంగా కూడా ప్రభుత్వం చేసిన పనులు కాకుండా ఇతర విషయాలు కూడా చదవడంతో సర్కారు ఆలోచనలో పడింది. తమిళిసై వ్యవహారంపై గుర్రుగా ఉంది. అందుకే ప్రభుత్వం గవర్నర్ ను ఎక్కడికి కూడా ఆహ్వానించడం లేదు.
ప్రస్తుతం జరిగే బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగ బద్ధమైన వ్యక్తిని పిలవకపోవడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం ఆమెను టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా గవర్నర్ పాత్రపై భిన్నమైన కథనాలు వస్తుండటంతో పరిణామాలు ఎలా మారతాయోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
గవర్నర్ తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారని, ఆ వాసనలు ఇంకా పోవడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా సాగే పాలనలో ఆమెకు మాత్రం స్వేచ్ఛ ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిందే చదవడం ఏమిటని అడుగుతున్నారు. ఆమెకు తెలిసింది చెప్పే హక్కు లేదా? ఆమె ప్రభుత్వానికి ఏజెంటా? రాజ్యాంగానికి ప్రతినిధి కాదా? అనే సంశయాలు వస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే బీజేపీ ఏజెంట్, ప్రభుత్వం చెప్పినట్లు వింటే గవర్నరా? ఇదెక్కడి న్యాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: తెలంగాణలో లిక్కర్ ధరలు తగ్గనున్నాయా?