
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్షాలు చులకనగా చూస్తాయి. గత ఎన్నికల్లో ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో బీజేపీ నేతలు పప్పూ అంటూ ఎగతాళి చేస్తుంటారు. ఓటమి తర్వాత రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు వదిలేసి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనలేదు. ఆ మధ్య పార్టీలోని సీనియర్ నాయకులు పార్టీ పటిష్టానికి సరైన నాయకుడు కావాలని రాహుల్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో సోనియాగాంధీ నే ప్రస్తుతం పార్టీ బరువు మోస్తోంది.
అయితే ఇటీవల రాహుల్ గాంధీ యాక్టివ్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన ఘటనలో రాహుల్ స్వయంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంకతో కలిసి వెళ్లారు. వీరి రాకను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ ను కింద పడేశారు. అటు ప్రియాంకను సైతం హథ్రాస్ రాకుండా కట్టడి చేశారు. అయితే ఏదో విధంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఇక ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై రాహుల్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పంజాబ్లో జరిగిన ట్రక్టర్ల ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తూ రైతులను ఆకట్టుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో రాహుల్ దూకుడుపై పార్టీలోని నాయకులు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికార ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయమంటూ చాటి చెబుతున్నాడని కాంగ్రెస్ నాయకులు ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. రాహుల్ గాంధీ ఇదే ఊపుతో ముందుకెళ్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం రావడం ఖాయమనే భావనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.
యంగ్ డైనమిక్ కాబట్టి నిరసన కార్యక్రమాల్లో దూకుడు బాగానే ఉన్నా బీజేపీపై గెలుపంటే మ్యాజిక్ కూడా కావాలని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.