ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గడిచిన పది నెలల్లో జగన్ సర్కార్ వైయస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ ద్వారా పేదలకు చేసిన సాయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా జగన్ ముందుచూపు పాలన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో 2.10 లక్షల మందికి 134 కోట్ల రూపాయలు గడిచిన పది నెలల్లో ఖర్చు చేశామని అన్నారు. డిశ్చార్జైన 48 గంటల్లోనే ఆరోగ్యశ్రీ నుంచి కోలుకున్న వాళ్ల ఖాతాల్లో ప్రభుత్వం 5 వేల రూపాయలు జమ చేస్తోందని వెల్లడించారు. వైయస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ కుటుంబ పెద్ద కోలుకునే సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలుస్తోందని చెప్పారు. జగన్ గారి ముందు చూపునకు వైయస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ మచ్చుతునక అని అన్నారు.
వైయస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ కింద రాష్ట్రంలో 836 జబ్బులకు 5 వేల రూపాయల సాయం అందుతోంది. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో సిబ్బంది సేకరిస్తారు. రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు 5 వేల రూపాయలు సాయం అందజేస్తారు. బ్యాంకు ఖాతా లేని వారు తమ ఖాతాకు బదులుగా కుటుంబ సభ్యుల ఖాతా ఇవ్వొచ్చు.
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు ఆరోగ్య ఆసరా ద్వారా ప్రయోజనం కల్పిస్తూ ఉండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైద్య చికిత్స కోసం 1000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తే ప్రభుత్వం ఆ వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.