కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతగా ముద్రగడ పద్మనాభం కొనసాగించిన ఉద్యమం ఏ స్థాయిలో కొనసాగిందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు మోసగించారంటూ.. ఆయన ప్రభుత్వం పై పెద్ద యుద్ధమే కొనసాగించారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంలో కాపు ఉద్యమ ప్రభావం కూడా చాలానే ఉందంటారు విశ్లేషకులు. అయితే.. జగన్ మాత్రం రిజర్వేషన్ అనేది కేంద్రం పరిధిలోని అంశం అంటూ.. ముందుగానే చెప్పేయడం.. అయినా ఆయన అధికారంలోకి రావడం జరిగిపోయాయి.
అయితే.. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముద్రగడ సైలెంట్ అయిపోయారు. ఆయనకు ఎంచుకోవడానికి సరైన ఆయుధం లేకపోవడమే కారణమని కూడా చెబుతారు పరిశీలకులు. అప్పుడంటే.. చంద్రబాబు తప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి.. ఆయనపై ఉద్యమించారు. కానీ.. జగన్ తన చేతుల్లో లేదని, కేంద్రం పరిధిలోని అంశమని ఎన్నికల ముందే చెప్పేశారు. కాబట్టి.. ఇప్పుడు ఆయన్ను అనడానికి ఏమీ లేదు. కేంద్రంపై పోరాటం చేయడానికి కాపులను సమీకరించడం.. ఉద్యమించడం.. అనేది సుదీర్ఘ అంశం. ఈ కారణాలతోనే ఆయన మౌనంగా ఉండిపోయారనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఈ విషయమై ఆ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ కొనసాగింది. జగన్ వచ్చిన తర్వాత ముద్రగడ సైలెంట్ అయ్యారంటూ ప్రచారం సాగడంతో.. చిన్నబుచ్చుకున్న ముద్రగడ.. తాను కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నానంటూ సంచలన ప్రకటన కూడా చేశారు. అప్పటి నుంచి ఆయన మౌనంగానే ఉండిపోయారు. సోషల్ మీడియాలో ప్రచారం కూడా నిలిచిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పారు ముద్రగడ. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి తీరును దునుమాడారు. గజపతి రాజుల త్యాగాలను మరిచిపోద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకుంటే.. ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు కూడా జారీచేశారు. ఉన్నట్టుండి ముద్రగడ ఈ విధంగా జగన్ సర్కారును టార్గెట్ చేయడంలో ఆంతర్యం ఏంటనే చర్చ మొదలైంది.
గతంలో ఎన్నో పదవులు అలంకరించిన ముద్రగడ.. ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారా? అనే ప్రశ్న కూడా వస్తోంది. ఇదే జరిగితే.. ఏ పార్టీలోకి వెళ్తారు? అన్నది కూడా చర్చలోకి వస్తోంది. బీజేపీలోకి తీసుకెళ్లేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే.. కాపుల రిజర్వేషన్ కు సంబంధించి, స్పష్టమైన హామీ ఇస్తేనే వస్తానని షరతు పెట్టారనే ప్రచారం కూడా సాగింది. క్లారిటీ ఇవ్వకపోవడంతోనే సైలెంట్ గా ఉండిపోయారని అన్నారు. మరి, ఇప్పుడు ఏం జరగనుంది? ముద్రగడ ఎలంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఈ తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం అనే చర్చ సాగుతోంది.