Huzurabad By-Elections: హుజూరాబాద్ లో గెలుపు ఎవరిది? ఇప్పుడీ ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతోంది. గెలుపు ప్రతీకార టీఆర్ఎస్ దా.. పంతం పట్టిన బీజేపీదా అన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. మధ్యలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా కదులుతోంది. బీజేపీకి ఫేవర్ గానే రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. కొండా సురేఖ ఎంట్రీతో టీఆర్ఎస్ ఓట్లు చీలుతాయని అంటున్నారు. ఇదే జరిగితే టీఆర్ఎస్ ఓడిపోతుందని అంటున్నారు. ఇలా రకరకాల ఊహాగానాల మధ్య హుజూరాబాద్ లో గెలుపు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు హుజూరాబాద్ ను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఎస్సీ కులాల అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించి లబ్ధిదారులకు యూనిట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో సర్వే చేసి మరికొంత మంది అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో మిగతా కులాల నుంచి తమకూ ‘బంధు’ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేసీఆర్ దళిత బంధు మాత్రమే ప్రవేశపెట్టడానికి కారణం ఏంటీ..? అనే చర్చ హాట్ హాట్ గా సాగుతోంది.
2014 కు ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని సీఎం ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల సీఎం సీట్లో కేసీఆర్ కూర్చోవాల్సి వచ్చింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం దళితుడని సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఏడేళ్ల తరువాత ప్రత్యేకంగా దళితుల కోసం రూ. 10 లక్షలు అందించే పథకం పెట్టడంపై సర్వత్రా ఆసక్తిగా చర్చ సాగుతోంది. తెలంగాణ పోరాటానికి మొదటి నుంచి కేసీఆర్ తో ఉన్న ఈటల రాజేందర్ ను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేశారు. ఆయన బీజేపీలో చేరారు. ఆ తరువాత తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హూజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ను ఓడించడానికే కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 శాతం మంది దళితులున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తే ఎస్సీలు 62,084, ఎస్టీలు 2623 మంది ఉన్నారు. మొత్తం 2,88, 604 జనాభాలో ఎస్సీ, ఎస్టీలను మినహాయితే మిగతా వారు లక్షా 20 వేల ఓట్లు ఉంటాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం దళిత కుటుంబాలు 21,000 ఉన్నాయి. ఎటూ చూసినా దళితుల సంఖ్య ఇక్కడ ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందుగానే ఆలోచించి వారిని ఆకట్టుకునేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని అంటున్నారు.
దళిత బంధు పథకం ద్వారా ఎస్సీ ఓటర్లను మచ్చిక చేసుకున్న టీఆర్ఎస్ బీసీ ఓటర్లకు కూడా పథకాలు ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో దళితుల తరువాత యాదవులు ఎక్కువగా ఉన్నారు. 40 వేలకు పైగా గొల్ల కుర్మలు ఉండడంతో వారికి గొర్ల పంపిణీ చేశారు. ఇక యాదవ్ కు చెందిన అభ్యర్థినే బరిలో ఉంచారు. మిగతా కుల సంఘాలు కొరిన కోర్కెలను తీరుస్తున్నారు. అయితే ఈ కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ‘కుల రాజకీయం ఎందుకనుకోవాలి.. ప్రతి కులానికి ఎంతో కొంత మేలు చేస్తుంది కదా..’ అని టీఆర్ఎస్ కు చెందిన ఓ నాయకుడు అన్నాడు.
ఇక దళిత బంధును ప్రవేశపెట్టడానికి హుజూరాబాద్ నే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే గతంలో ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ పథకాన్ని ఇక్కడే ప్రారంభించారు. అ పథకం సక్సెస్ అవుతోంది. అందువల్ల దళిత బంధును కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఈ పథకం నియోజకవర్గానికి మాత్రమే పరిమిత కాదని 119 నియోజకవర్గాల్లోని 11,900 కుటుంబాలకు అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ఈటల రాజేందర్ కు దళితుల అండ ఎక్కువగా ఉందని టీఆర్ఎస్ ముందే గ్రహించింది. అందుకనే దళిత బంధు పథకంపై ఫోకస్ పెట్టిందని ప్రచారం సాగుతోంది. మొత్తంగా ఇప్పుడు దళితుల అండగా టీఆర్ఎస్ గెలుస్తుందా? లేక దళితబందే టీఆర్ఎస్ ను ముంచుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. మిగతా వర్గాలు ఎటువైపు నిలుస్తాయన్నది ఉత్కంఠగా మారింది.