Homeఆంధ్రప్రదేశ్‌ఈ ఫలితంతో జగన్‌ను తట్టుకోవడం కష్టమేనా?

ఈ ఫలితంతో జగన్‌ను తట్టుకోవడం కష్టమేనా?

Jagan
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అంటుంటారు. పల్లెను తల్లి అని కూడా పిలుస్తుంటారు. మరి ఆ తల్లి దీవెనలు ఎవరికి ఉంటాయో వారినే ఎప్పుడూ విజయం వరిస్తుందనేది వాస్తవం. గతంలో ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని పెట్టనంత వరకూ పల్లెలు ఇందిరమ్మ నామస్మరణ చేశాయి. కాంగ్రెస్ కే ఓటెత్తి జై కొట్టేవి. అన్నగారుగా జనం ఎదుటకు వచ్చిన రామారావు రాజకీయంతో తమ జాతకాలు మారుతాయని పల్లె జనం భావించారు. నాటి నుంచి ఆయన మరణించేంతవరకూ టీడీపీకే ఓట్లు వేసి గెలిపిస్తూ వచ్చారు. ఇక చంద్రబాబు జమానాలో మాత్రం పల్లెలు క్రమంగా దూరమవుతూ వచ్చాయి. ఆయన పాలన నచ్చకనో.. ఆయన విధివిధానాలు నచ్చకనో తెలియదు కానీ రోజురోజుకూ దూరం పెరిగింది. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అదే నిరూపితమైంది.

Also Read: ఏపీ విద్యార్థినులకు సీఎం జగన్ మరో బంపర్ గిఫ్ట్

ఇప్పుడు ఏపీలో జగన్ అంటే పల్లె జనం ఎనలేని మమకారం చూపిస్తున్నారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి దన్నుగా నిలుస్తున్నారు. ఎక్కడైనా ఓట్ల తేడా జరిగి వైసీపీ ఓడినా.. పల్లెలు మాత్రం ఫ్యాన్ పార్టీ నీడలోనే సేదతీరుతున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 151 సీట్లు వైసీపీకి వచ్చాయంటే దానికి కారణం పల్లెల మద్దతు సంపూర్ణంగా ఉండడమే. అధికారంలోకి వచ్చిన జగన్ కూడా తన సంక్షేమ పథకాలతో గ్రామీణులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ ఫలితాలే ఇప్పుడు ఓట్ల రూపంలో కురిశాయని అంటున్నారు.

సాధారణంగా నాయకుడు అంటే పల్లెలు అంటే ఏంటో తెలియాలి. పల్లెల పట్ల ప్రేమ ఉండాలి. అది ఉన్న వారికి అసలు తిరుగే ఉండదు. పల్లెలు కూడా అక్కున చేర్చుకుంటాయి. నాడు ఇందిరమ్మ అయినా.. ఎన్టీయార్ అయినా, వైఎస్సార్ సహా ఎవరైనా కూడా పల్లెల మద్దతు దండీగా ఉండబట్టే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతలుగా నిలిచారు. జగన్ కూడా అందుకే పల్లెలనే నమ్ముకున్నారు. వారి మనసులో నిలిచిపోతే అది శాశ్వతమైన చోటు అని కూడా గ్రహించిన జగన్ వారిని దృష్టిలో పెట్టుకునే తన పథకాలకు రూపకల్పన చేశారు.

Also Read: ఏడాదిగా జీతాల్లేవు.. హెచ్.ఆర్.సీని ఆశ్రయించిన ఆ పత్రిక ఉద్యోగులు

ఏపీ జనాభాలో అరవై శాతం పైగా ఉన్న ఈ పల్లెలే వైసీపీకి శ్రీరామ రక్షగా ఉన్నాయన్నది వాస్తవం. అన్న గారి జమానాలో టీడీపీకి పల్లెల్లో మంచి పట్టు ఉండేది. కాంగ్రెస్ ను పట్టణ జనాలు ఆదరించేవారు. అయినా సరే ఎన్టీయార్ మూడు సార్లు బంపర్ విక్టరీ కొట్టి ముఖ్యమంత్రి కాగలిగారు అంటే పల్లెజనం వెల్లువలా ఓట్లేసి గెలిపించడమే. ఇప్పుడు కూడా అచ్చం అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. పట్టణాల్లో జగన్ రాజకీయం పట్ల విమర్శలు ఉన్నా పల్లెల్లో మాత్రం పట్టం కట్టే సీన్ ఉంది. పల్లె చల్లగా చూడాలి కానీ ఎన్ని ఎన్నికలైనా సునాయాసంగా నెగ్గేయవచ్చు అని పూర్వపు నాయకులు నిరూపించారు. జగన్ కూడా ఇప్పుడు అదే బాటలో సాగుతున్నారు. దాదాపుగా పదివేల పైచిలుకు పంచాయతీలను గెలుచుకుని పార్టీని పటిష్టం చేసుకున్న జగన్‌ను ఢీకొట్టే వారు ఇప్పట్లో లేరనేది వాస్తవం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular