JD’ Lakshminarayana : ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ని స్థాపించారు. ఏపీలో సంచలనం సృష్టించారు. ఇంతకీ ఆయన వేసిన స్టెప్.. ఎవరికి లాభం?ఎవరికి నష్టం? ఇప్పుడు ఏపీలో లోతైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఆయన పార్టీ ఆవిర్భావంతో ఏపీ రాజకీయ సమీకరణలు మారాయని.. అలా మారడానికి ఆయన పార్టీ స్థాపించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలను శాసించగల నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ సిబిఐ మాజీ అధికారిగా.. రాజకీయ అరంగేట్రం చేసిన లక్ష్మీనారాయణ అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.g ఒక నిజాయితీ కలిగిన అధికారిగా దేశవ్యాప్తంగా ఆయన సుపరిచితులు. ఏపీ సీఎం జగన్ తో పాటు కీలక కేసులను ఆయన విచారణ అధికారిగా ఉన్నారు. అప్పటి నుంచి జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ కేసుల్లో విచారణ అధికారి కావడంతో టిడిపి అనుకూల మీడియాలో లక్ష్మీనారాయణకు ప్రాధాన్యత దక్కింది. జగన్ కేసు విచారణలో కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు ఆయన చేరవేయడంతో ఆయనకు టాప్ ప్రయారిటీ లభించింది. గత ఎన్నికల్లో అనూహ్యంగా జనసేన తరఫున ఆయన బరిలో నిలిచారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు రెండున్నర లక్షల ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతరం జనసేనకు దూరమైనా.. యాక్టివ్ గా ఉండేవారు. రాజకీయాలకు దగ్గరగా ఉండేవారు.
అయితే తాజాగా జేడీ లక్ష్మీనారాయణ సొంతంగా పార్టీ పెట్టడం.. ఎన్నికలకు రెండు నెలల ముందుగా పార్టీని ప్రకటించడం సంచలనం గా మారింది. ముఖ్యంగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. పవన్ ద్వారా కాపు సామాజిక వర్గం చిరకాల రాజకీయవాంఛ తీరుతుందని కాపు సామాజిక వర్గంచాలా ఆశలు పెట్టుకుంది.కానీ వైసీపీ విముక్త ఏపీ తన ధ్యేయమని చెబుతున్న పవన్.. పొత్తుకు విఘాత చర్యలకు పాల్పడితే.. వారంతా వైసిపి కోవర్టులుగా భావిస్తానని హెచ్చరించారు.ఈ నేపథ్యంలోనారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో కీలక ప్రకటన చేశారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు తప్పకుండా సీఎం అవుతారని.. మరో అంశానికి తావు లేదని లోకేష్ తేల్చి చెప్పారు. దీనిపై కాపు సామాజిక వర్గం నుంచి ఒక రకమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాపు సంక్షేమ సంఘం ప్రతినిధిగా ఉన్న మాజీ ఎంపీ హరి రామ జోగయ్య ఘాటుగా స్పందించారు. ఏకంగా పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.
అయితే ఈ పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన సిపిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించడం విశేషం. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినా.. ఆదిశగా చర్యలేవీ లేవు. కానీటిడిపి,జనసేన పొత్తు కుదిరిన వేళ.. ఇప్పుడిప్పుడే కాపు సామాజిక వర్గం ఆ కూటమి దిశగా అడుగులు వేస్తున్న వేళ జేడీ లక్ష్మీనారాయణ పార్టీని ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇది కాపు సామాజిక వర్గం ఓట్లు టిడిపి,జనసేన ఓటమి వైపు మళ్లకుండా ఉండేందుకు జరిగే ప్రయత్నం గా అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం కాపు సామాజిక వర్గం వైసీపీకి వ్యతిరేకంగా ఉంది. పవన్ వారికి ఆశాదీపంగా ఉన్నా.. ఆయన టిడిపితో పొత్తు పెట్టుకోవడం.. పవర్ షేరింగ్ విషయంలో టిడిపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడంతో.. కాపు సామాజిక వర్గంలో ఒక రకమైన అనుమానం నెలకొంది. ఒకవేళ కాపు సామాజిక వర్గం ఆ కూటమి వైపు టర్న్ అయితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అందుకే కాపు సామాజిక వర్గంలో చీలిక తెచ్చేందుకు.. జగన్ తెర వెనుక జేడీ లక్ష్మీనారాయణతో పార్టీ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కాపుల్లో విభజన తెచ్చి.. టిడిపి, జనసేన కూటమి వైపు మెజారిటీ కాపులు వెళ్లకుండా నియంత్రించేందుకు జేడీ లక్ష్మీనారాయణ తో ప్రయత్నం చేశారనివార్తలు వస్తున్నాయి.
తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాపులు డిఫెన్స్ లో ఉన్నారు. రాజ్యాధికారం కోసం దశాబ్దాలుగా కాపులు ఎదురుచూస్తున్నారు. చిరంజీవి రూపంలో అవకాశం దక్కిన సద్వినియోగం చేసుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ ద్వారా కలలను సాకారం చేసుకోవాలని కాపులు ఆలోచించారు. కానీ తనకు రాజ్యాధికారం కంటే వైసిపి విముక్త ఏపీ లక్ష్యం అని పవన్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే వైసిపి ఓటమి ఖాయమని.. కానీ కాపులకు రాజ్యాధికారం సాధ్యం కాదని మెజారిటీ సామాజిక వర్గం అభిప్రాయపడుతోంది. అదే సమయంలో చంద్రబాబు హయాంలో కంటే జగన్ పాలనలో కాపులకు అన్యాయం జరుగుతోందని నమ్మిన వారు ఉన్నారు. అందుకే రాజ్యాధికారం కంటే.. కాపు సామాజిక వర్గానికి న్యాయం జరిగితే చాలని భావించిన వారు ఉంటారు. అదే సమయంలో పవన్ రూపంలో రాజ్యాధికారం దక్కే ఛాన్స్ వచ్చినా.. ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారని అనుమానించిన వారు ఉన్నారు. ఇటువంటి సమయంలో జెడి లక్ష్మీనారాయణ సొంత పార్టీని స్థాపించడం ఒక సంచలనమే. అయితే ఈ ప్రయత్నం వెనుకరాజకీయ వ్యూహం ఉందనుకుంటే కాపు సామాజిక వర్గం అండగా నిలిచేది అనుమానమే. ఇప్పటికే పవన్ వైపు కాపు సామాజిక వర్గం మొగ్గు చూపుతోంది. దానికి విరుగుడు చర్యగా జెడి లక్ష్మీనారాయణ ఎంటర్ కావడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. అందుకే ఈ విషయంలో కాపు సామాజిక వర్గం ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.