Sankranti 2024 Movies: సంక్రాంతి వచ్చిందంటే టాలీవుడ్ లో పంచాయితీలు షురూ అవుతాయి. ప్రతి ఏడాది ఇది జరిగే తంతే. సంక్రాంతి పండగ సినిమాలకు అనుకూలమైన సీజన్. దాదాపు వారం రోజులు పండగ వాతావరణం ఉంటుంది. మూడు రోజులు సెలవు దినాలు. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు ఉంటాయి. హిట్ టాక్ వస్తే కాసుల వర్షమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పండగ దినాల్లో సినిమాకు వెళ్లడం సాంప్రదాయంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ ని క్యాష్ చేసుకోవాలని ప్రతి నిర్మాత, హీరో కోరుకుంటాడు.
సహజంగానే పోటీ తీవ్రంగా ఉంటుంది. థియేటర్స్ సమస్య ఏర్పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వందల థియేటర్స్ మూతపడ్డాయి. కాగా ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు, తెగింపు చిత్రాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేయలేక గొడవలు జరిగాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. దిల్ రాజు తగ్గడంతో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలకు థియేటర్స్ లభించాయి.
ఈ ఏడాది అనూహ్యంగా ఐదు చిత్రాలు సంక్రాంతికి విడుదల తేదీలు ప్రకటించాయి. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్, ఈగిల్ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. గుంటూరు కారం జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. చెప్పినట్లు ఆ తేదీనే విడుదల చేస్తామని సూర్యదేవర నాగవంశీ పలుమార్లు స్పష్టత ఇచ్చారు. తేజా సజ్జా హనుమాన్ నిర్మాతలు కూడా అదే రోజున రావాలని పట్టుబడుతున్నారు.
మహేష్ వంటి పెద్ద హీరోతో తలపడేందుకు భయపడి వెనక్కి తగ్గుతారు అంటుకుంటే… హనుమాన్ నిర్మాతలు ససేమిరా అంటున్నారట. రవితేజ ఈగిల్, వెంకటేష్ సైంధవ్ జనవరి 13 విడుదల తేదీగా ప్రకటించాయి. నాగార్జున నా సామిరంగ జనవరి 14న రానుంది. దిల్ రాజు, సురేష్ బాబు, టీ జీ విశ్వప్రసాద్, నాగవంశీ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది. అవగాహన కుదర్లేదు. ఒకరిద్దరు జనవరి 1న వస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నా.. ఎవరూ వినడం లేదట.
మొండిగా ముందుకు వెళితే థియేటర్స్ తక్కువ సంఖ్యలో దక్కుతాయి. దాని వలన డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతారు. మహేష్ బాబు వంటి పెద్ద హీరో సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ అవసరం అవుతాయి. సినిమా అందుబాటులో లేకపోతే… ప్రేక్షకులు వేరే సినిమాలకు వెళతారు. కలెక్షన్స్ నష్టపోవాల్సి వస్తుంది. దానికి తోడు ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయిలాన్ చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. డబ్బింగ్ సినిమాలు ఆపేద్దాం అంటే… కోలీవుడ్ నుండి హెచ్చరికలు. మీ సినిమాలు ఇక్కడ కూడా విడుదల కానీయం అంటున్నారు. విడుదల తేదీలపై క్లారిటీ వస్తే కానీ పబ్లిసిటీ ప్లాన్ చేసుకోరు. మరి కొన్ని మీటింగ్స్ జరగాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి…