TDP Janasena Alliance: పవన్ ముక్కు సూటిమనిషి. అది అందరికీ తెలిసిన విషయమే. 2014లో రాష్ట్రంలో టిడిపికి, జాతీయస్థాయిలో బిజెపికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019లో ఆ రెండు పార్టీలకు దూరమయ్యారు. ఇలా దూరమయ్యే క్రమంలో.. అందుకు కారణాలను ప్రకటించే దూరమయ్యారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపితో జత కట్టారు. ఆ విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీ అరాచకాలను తట్టుకోలేక టిడిపి తో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గ కారణాలు సైతం ప్రజలకు వివరించారు. రేపు పొద్దున్న టిడిపి విధానాలను నచ్చకపోయినా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. స్పష్టమైన కారణాలు చెప్పి బయటకు వెళ్లే ధైర్యం ఒక్క పవన్ కు మాత్రమే ఉంది.
2014 ఎన్నికల్లో గెలిచి టిడిపి అధికారంలోకి రావడానికి పవన్ ఒక కారణం. కానీ పవన్ త్యాగాన్ని టిడిపి సైతం గుర్తించలేకపోయింది. ప్రారంభంలో పవన్ కు ఇచ్చిన ప్రాధాన్యత క్రమేపి తగ్గించింది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొంతమంది మంత్రులు వెళ్లి పవన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అది టిడిపి నాయకత్వానికి మింగుడు పడలేదు. టిడిపి అసమర్థ విధానాలను పవన్ ప్రశ్నించే సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు అతిగా మాట్లాడారు. మీ అన్న చిరంజీవిని గెలిపించుకోలేని నువ్వా టిడిపిని గెలిపించింది అంటూ కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు శృతి మించి మాట్లాడారు. అందుకే పవన్ దూరమయ్యారు. ఒంటరి పోరుతో టిడిపికి కోలుకోలేని దెబ్బ తీశారు.
ఇప్పుడు టిడిపికి పవన్ అవసరం ఎక్కువగా ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టిడిపి వైపు వచ్చారు. దీంతో వైసిపి పని అయిపోయిందని.. జగన్ ఇక అధికారంలోకి రారని తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయ్యింది. అందుకే పవన్ ను పక్కన పెట్టేసింది. ఈ క్రమంలో నేతల మాటలు కోటలు దాటాయి. చివరకు పవన్తో పాటు కుటుంబాన్ని సైతం కొందరు టిడిపి నాయకులు టార్గెట్ చేశారు. అందుకు పవన్ సైతం తనదైన శైలిలో వ్యూహం పన్నారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమయ్యారు. వైసిపి గెలుపునకు దోహదపడ్డారు. అందుకే చంద్రబాబు ఈ విషయాన్ని గుర్తించగలిగారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్తో స్నేహాన్ని కోరుకున్నారు.
గత అనుభవాల దృష్ట్యా పవన్ తో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు టీం కు ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించకుంటే పవన్ ద్వారా మూల్యం చెల్లించుకోక తప్పదని టిడిపి నేతలకు సైతం తెలుసు. ప్రస్తుతం పవన్ అవసరం తెలుగుదేశం పార్టీకి ఆవశ్యం, అనివార్యం.అటు పవన్ సైతం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.బలహీనమవుతున్న తెలుగుదేశం పార్టీకి తన యువశక్తిని అందిస్తానని చెప్పుకొస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడు పడని విషయమే అయినా వారు ఎదురు చెప్పలేకపోతున్నారు. కనీసం ఖండించలేకపోతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే మాత్రం.. పాత రోజుల మాదిరిగా వ్యవహరిస్తే అది టిడిపికే నష్టం. అందుకే పవన్ సైతం తన బలాన్ని ముందు పెడుతున్నారు. టిడిపి బలహీన పడిందని చెప్పుకొస్తున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం పార్టీ నేతలకు చక్కనైన సందేశం పంపుతున్నారు. గతం మాదిరిగా వాడుకుని వదిలేస్తామంటే కుదరని పనిగా హెచ్చరికలు పంపుతున్నారు. మంచి పాలన అందించకపోతే వ్యతిరేకిస్తానని ముందుగానే సంకేతాలు పంపుతున్నారు. మొత్తానికైతే పవన్ తో తెలుగుదేశం పార్టీకి రిస్కె.