Industrialists: ఆంధ్రాకు అస్సలు రామంటున్నారు పారిశ్రామికవేత్తలు

తాజాగా సుమన్ బోస్ విషయంలో జరిగిన వ్యవహారం బయట పడింది. కానీ అంతకంటే ముందుగానే లూలూ విషయంలో కూడా ఇదే జరిగింది. చంద్రబాబు, నాటి కేంద్ర మంత్రి వెంకయ్య చొరవతో లూలూ కంపెనీని విశాఖకు తీసుకువచ్చారు.

Written By: Dharma, Updated On : September 19, 2023 1:37 pm
Follow us on

Industrialists: పాలకుల విశాల దృక్పథం తోనే అభివృద్ధి సాధ్యం. రాజకీయాలతో ముడి పెట్టకుండా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తేనే పరిశ్రమలు, ఐటీ సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. యువతకు ఉద్యోగ, అవకాశాలు మెరుగుపడతాయి. అయితే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తరహా వాతావరణం కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. గతం నుంచి కొనసాగుతున్న పరిశ్రమల యాజమాన్యాలకు వేధింపులు ఎదురవుతుండడంతో అవి పునరాలోచనలో పడుతున్నాయి. పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నాయి.

ఏపీ సర్కార్ వ్యవహార శైలిపై కార్పొరేట్ సర్కిల్లో ఒక రకమైన ప్రచారం ఉంది. అన్నింటికీ రాజకీయ ముద్ర వేసి ఇబ్బందులు పెడతారని జాతీయస్థాయిలో ప్రారంభమైంది. తమ రూట్లోకి రాని వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకు కూడా వెనుకడుగు వెయ్యరని సుమన్ బోస్ వ్యవహారంతో తేలింది. సిమెన్స్ ఇండియా మాజీ ఎండి అయిన సుమన్ బోస్.. చాలా కార్పొరేట్ సంస్థల్లో పని చేశారు. ఆయన హయాంలో ఏపీకి సిమెన్స్ కంపెనీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒప్పందం జరిగింది. లక్షలాదిమంది ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ లో స్కాం జరిగి ఉంటే ఆధారాలను బయటపెట్టాలి. తప్పు జరిగితే అరెస్టు చేయాలి. కానీ రాజకీయ కక్ష సాధింపుల కోసం డబ్బులు ఆశ చూపడం.. శవాన్ని పక్కన పెట్టి బెదిరించడం వంటివి చేయడం మాత్రం కలకలం రేపుతున్నాయి. కేవలం రాజకీయ కక్షతో.. కార్పొరేట్ దిగ్గజాలను బలి పశువులు చేయడం వారిని పునరాలోచనలో పడేస్తోంది.

తాజాగా సుమన్ బోస్ విషయంలో జరిగిన వ్యవహారం బయట పడింది. కానీ అంతకంటే ముందుగానే లూలూ విషయంలో కూడా ఇదే జరిగింది. చంద్రబాబు, నాటి కేంద్ర మంత్రి వెంకయ్య చొరవతో లూలూ కంపెనీని విశాఖకు తీసుకువచ్చారు. కానీ రాజకీయ కక్షతో దాన్ని తరిమేయడానికి జరిగిన ప్రయత్నం అందరికీ తెలిసిందే.దీంతో ఏపీ అంటేనే కార్పొరేట్ సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. అమర్ రాజా కంపెనీ విషయంలో జరిగిన హడావిడి అందరికీ తెలిసిన విషయమే. ఏపీ వద్దనుకున్నా.. తెలంగాణ మాత్రం తన అక్కున చేర్చుకుంది. కియా పరిశ్రమ గురించి చెప్పనక్కర్లేదు. ఏర్పాటు కాకమునుపే భయపెట్టి ఈ రాష్ట్రం నుంచి పంపించేశారు.అయితే వీరు రాజకీయ కక్షపూరితంగా చేస్తున్నా.. ఈ రాష్ట్ర యువతకు అంతులేని నష్టానికి గురి చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధిని దూరం చేస్తున్నారు.

ఏపీలో పరిశ్రమలు, పారిశ్రామిక విస్తరణ అంటే.. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఆదాని, గ్రీన్ కో మాత్రమే కనిపిస్తున్నాయి. వాటికే కాంట్రాక్టులు దక్కుతున్నాయి. వేల ఎకరాల భూములను ధారాధత్తం చేస్తున్నారు. కానీ ఉద్యోగాలు కనిపించవు, పారిశ్రామిక ఉత్పత్తులు కానరావు. పోనీ పారిశ్రామిక ఒప్పందాలు అమల్లోకి వస్తున్నాయంటే అవీ లేవు. కేవలం పేపర్లకే పరిమితం అవుతున్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ తరం ఉద్యోగం, ఉపాధికి దూరమైంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నట్టు ఓటు వేసిన ఏపీ ప్రజలకు నిట్టూర్పులు తప్పలేదు.