Largest Aquarium In Hyderabad: హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరనుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అమెజాన్ బిగ్ డాటా సెంటర్, టీ హబ్, దుర్గం చెరువు వంతెన.. వీటి సరసన మరో ఆధునిక నిర్మాణం చేరబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద అక్వేరియం నిర్మాణాన్ని చేపట్టేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్వాల్ గూడ ఎకో పార్కులో ఈ అక్వేరియం నిర్మించనున్నారు. ఇందులో ఏవియరి, బోర్డు వాక్ వంటి సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ పనులకు సంబంధించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్ పరిధిలో ల్యాండ్ స్కేప్ ఎకో పార్క్ ను మంత్రి ప్రారంభించారు. దీనికి సమీపంలో ఉన్న గండిపేట చెరువు పరిసర ప్రాంతాల్లోని 75 ఎకరాల భూమిని కూడా అభివృద్ధి చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. అయితే కృష్ణా, గోదావరి నదుల నుంచి జంట నగరాల అవసరాలకు తాగునీరు సేకరిస్తున్నందున.. గండిపేట జలాశయంపై ఒత్తిడి తగ్గించామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇదే సమయంలో గండిపేట ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చే యోచన ప్రభుత్వానికి ఉందని ఆయన స్పష్టం చేశారు.

జీవో 111 ఎత్తేసిన అనంతరం
వాస్తవానికి రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో జిఓ 111 అమల్లో ఉంది. దీని ప్రకారం ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ప్రకటించింది.. వికారాబాద్ కు సరిహద్దు ప్రాంతంగా ఉండటంతో.. ఇక్కడ నిర్మాణాలు చేపడితే జంతువుల ఆవాసాలు దెబ్బతింటాయని అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవోను ఎత్తివేసింది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నది. కాగా 111 జీవో అమలులో ఉన్న జన్వాడ ప్రాంతంలో కేటీఆర్ కు ఫామ్ హౌస్, ఇతర టిఆర్ఎస్ అగ్ర నాయకులకు భారీ ఎత్తున భూములు ఉండటంవల్లే జీవో ఎత్తివేసారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ జీవో ఎత్తివేతపై కొంతమంది కోర్టుకు వెళ్లారు.

కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఇచ్చే నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని కోర్టుకు నివేదించింది. అయితే గండిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 80 వేల ఎకరాల పై చిలుకు భూములు ఉన్నాయి. 111 జీవో ఉండటం వల్ల ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. ఆ మధ్య రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లోకి ఒక పులి వచ్చి కలకలం సృష్టించింది. దీనికి కారణం 111 జీవో వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణం సుభిక్షంగా ఉండటమే. మొన్నటి వరకు కూడా ఈ ప్రాంతంలో వివిధ రకాల జంతువులు తిరుగుతుండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం జీవో ఎత్తివేయడంతో బహుళ నిర్మాణాలు వెలిసే అవకాశం ఉంది. దీనివల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని కాలుష్యం పెరుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
84 గ్రామాల అభివృద్ధి కోసమే
అయితే ఈ జీవో 111 పరిధిలో 84 గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి వికారాబాద్ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఎంత లేదనుకున్నా 80 ఎకరాల భూ లభ్యత ఉన్నది. ఈ జీవో ఎత్తివేసిన క్రమంలో మరో అధునాతన నగరం వెలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే నగరానికి ఉత్తర మార్గంలో ఉన్న సైబరాబాద్, నానక్ రామ్ గూడ, నెక్నాం పూర, జీనోమ్ వ్యాలీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో 27 అంతస్థుల వరకు భవనాలు వెలుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఎల్బీనగర్ ప్రాంతంలోనూ ఆ స్థాయిలో రియల్టీ రంగం ఊపందుకుంటున్నది. మరోవైపు గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ భారీగా భూ లభ్యత ఉన్న నేపథ్యంలో ఇదే స్థాయిలో మరో నగరం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందులో భాగంగానే వివిధ రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అంటున్నారు. అయితే 111 జీవో ఎత్తివేసిన నేపథ్యంలో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే ప్రభుత్వం తదుపరి అడుగులు వేస్తుందని అధికారులు అంటున్నారు. కాగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం భూమి ఆరు నుంచి 8 కోట్ల వరకు పలుకుతోంది.