Larsen & Toubro : ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నికైనప్పటి నుంచి అంటే 2014 నుంచి రక్షణ శాఖకు అతిపెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు. రక్షణ శాఖ బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుందని, ఇతర దేశాలు కూడా భయ భక్తులతో ఉంటాయని అనుకున్న ఆయన ఏటికేడూ రక్షణ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచుకుంటూ పోతున్నారు. ‘మేకిన్ ఇండియా’ ప్రాజెక్టు ద్వారా తయారు చేసిన రక్షణ రంగానికి సంబంధించిన చాలా వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడంతో పాటు రాఫెల్ విమానాలతో సహా కొన్నింటిని దిగుమతి కూడా చేసుకుంటున్నారు. అయితే ఇటీవల స్వదేశీ కంపెనీతో అతిపెద్ద డీల్ చేసుకున్నాడు. భారత సైన్యం కోసం 155 mm/52 క్యాలిబర్ కే9 వజ్ర-T స్వీయ చోదక ట్రాక్డ్ ఆర్టిలరీ గన్‌ల కొనుగోలు కోసం లార్సెన్ & టూబ్రో (L&T)తో రక్షణ మంత్రిత్వ శాఖ ₹7,628.70 కోట్ల ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ అధునాతన వ్యవస్థలు మేకిన్ ఇండియాలో రూపొందించబడ్డాయి. సైన్యాన్ని మరింత బలిష్టంగా మార్చేందుకు ఇవి దోహదపడతాయి. అధిక చలనశీలత, ఖచ్చితత్వ లక్ష్యం, దీర్ఘ-శ్రేణి ఫైర్‌పవర్ అమర్చబడి, కే9 వజ్ర-T తుపాకులు అధిక ఎత్తయిన ప్రదేశాల నుంచే కాకుండా తక్కువ ఉష్ణోగ్రతలు కలిగిన ప్రదేశాలల్లో కూడా పని చేస్తాయి. వీటితో సైన్యం సామర్థం పెరుగుతుంది.
మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు మద్దతిస్తూ భారత ఫిరంగీ వ్యవస్థను ఆధునీకరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిరుద్యోగులు, కార్మికులకు నాలుగేళ్ల ఉపాధిని కల్పించనుంది. ఈ ప్రాజెక్టుల్లో ఎంఎస్ఎంఈలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ‘ఈ స్వదేశీ ఫిరంగి వ్యవస్థ భారత సైన్యం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా డ్రైవ్ కింద ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది’ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
‘కే 9 వజ్ర-T రెండో బ్యాచ్, మొదటిది దాని లాగానే గుజరాత్‌లోని హజీరాలోని అత్యాధునిక ఆర్మర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్‌లో తయారవుతుంది.’ అని ఎల్‌అండ్ టీ ప్రెసిషన్ ఇంజినీరింగ్ & సిస్టమ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్ అరుణ్ రాంచందానీ చెప్పారు. ‘జనవరి 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ తయారీ కేంద్రం అనేక ఎంఎస్ఎంఈ యూనిట్లను కలుపుకొని సమగ్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలో సాయుధ, ఫిరంగి ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడంలో కీలకమైనది.’ అని చెప్పారు.
కే9 వజ్ర-T అత్యాధునిక స్వీయ-చోదక ట్రాక్డ్ ఆర్టిలరీ గన్. దక్షిణ కొరియా హన్వా డిఫెన్స్ అభివృద్ధి చేసిన కే9 థండర్ ప్లాట్‌ఫారమ్‌పై దీనిని నిర్మించారు. వజ్ర-Tని మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద లార్సెన్ & టూబ్రో (L&T) దేశంలో తయారు చేసింది. ఈ 155 mm/52-క్యాలిబర్ గన్ ఉన్నతమైన ఫై ర్‌పవర్, వేగవంతమైన కదలిక, ఖచ్చితమైన లక్ష్య సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అధిక తీవ్రత, దీర్ఘ-శ్రేణి నిశ్చితార్థాలకు అనువైనదిగా చేస్తుంది. దాని అధునాతన లక్షణాల్లో ఆటోమేటిక్ లోడింగ్ సిస్టమ్, అధునాతన అగ్ని నియంత్రణ, సమర్థవంతమైన కవచ రక్షణ ఉన్నాయి. విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగేలా దీన్ని రూపొందించనున్నారు. కే9 వజ్ర-T ఎడారుల నుంచి ఎత్తయిన ప్రాంతాల నుంచి ఇంకా చాలా మార్గాల నుంచి సులువుగా ప్రయాణం చేయగలదు.
లార్సెన్ & టూబ్రో (L&T) ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, సాంకేతిక సేవల్లో దాని నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. 8 దశాబ్దాలుగా విస్తరించిన వారసత్వంతో, దేశంలో మౌలిక సదుపాయాలు, రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది. L&T దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతిని కొనసాగిస్తోంది.