కొద్దిరోజులుగా భారత్-చైనా దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత్ కు చెందిన 21మంది జవాన్లు వీరమరణం పొందగా చైనా తరుఫున కూడా భారీ నష్టమే జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ చైనాకు ధీటుగా జవాబువ్వడంతో చైనా కొంత వెనక్కి తగ్గింది.
Also Read: చైనా భయపడిందా..చర్చలకు దిగొస్తోందా.. కారణమదే?
సరిహద్దులను ఆక్రమించేందుకు యత్నిస్తున్న చైనా కుయత్నాన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఈ పరిణామాలు మింగుపడని చైనా ఓవైపు భారత్ తో శాంతి ప్రవచనాలు వల్లిస్తూనే దొంగదెబ్బ తీసేందుకు యత్నిస్తోంది. భారతే తమ భూభాగాలను ఆక్రమించుకుంటుందని చైనా ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేస్తోంది. ఈ యత్నాలు ఫలించకపోవడంతో కొద్దిరోజులుగా చైనా స్తబ్ధుగా ఉంది. అయితే గత మూడ్రోజులుగా చైనా సైనికులు సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్నారు.
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. ఇరుదేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయన్నారు. చైనా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తుందన్నారు. భారత్ సైతం చైనాకు ధీటైనా జవాబిచ్చేందుకు సిద్ధపడుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాను మధ్య వర్తిత్వం చేస్తానంటూ ట్రంప్ ప్రకటించాడు.
Also Read: పబ్ జీకి పోటీగా భారతీయ ‘ఫౌ-జీ’
ట్రంప్ గతంలోనూ ఇలాంటి ప్రకటనే చేశారు. గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య ఘర్షణ జరిగినపుడు కూడా ట్రంప్ స్పందించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికా మధ్య వర్తిత్వం చేస్తుందని ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు అవసరమైతే సాయం అందించేందుకు తాను రెడీ అంటూ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ప్రతిపాదనను ఇరుదేశాలు తిరస్కరించారు. తమ దేశాల మధ్య నెలకొన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశాయి. తాజాగా మరోసారి చైనా-భారత్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నారు. దీంతో ట్రంప్ మరోసారి మధ్య వర్తిత్వం చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.