India Stampedes : ఐపీఎల్ లో 2025 ఎడిషన్ కు సంబంధించి కన్నడ జట్టు ఛాంపియన్ గా అవతరించింది.. చరిత్రలో తొలిసారిగా విజేత కావడంతో కన్నడ జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ గ్రాండ్ విక్టరీని సెలబ్రేట్ చేయడానికి కర్ణాటక క్రికెట్ జట్టు సాహసానికి పాల్పడింది. అంచనాలకు మించి అభిమానులు వస్తారని అంచనా ఉన్నప్పటికీ.. విక్టరీ పరేడ్ నిర్వహించడానికి సమాయత్తమైంది. ఇందులో భాగంగా బెంగళూరులో భారీగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ముందుగానే బెంగళూరు పోలీసులు ఒప్పుకొక పోయినప్పటికీ.. కర్ణాటక క్రికెట్ సంఘం లేని ఆడంబరానికి పోయి అభిమానుల ప్రాణాలు బలి గొన్నది. ఈ కథనం రాసే సమయం వరకు 11 మంది కన్నుమూశారని.. 50 కి మించి అభిమానులు గాయపడ్డారని తెలుస్తోంది. అంతిమంగా ఎంతమంది చనిపోయారనేది కొన్ని గంటలు గడిస్తే తెలుస్తుందని కర్ణాటక అధికారులు చెబుతున్నారు. మనదేశంలో ఈ ఏడాది చిన్న స్వామి స్టేడియం నుంచి మొదలుపెడితే గోవాలోని ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటల వరకు అనేక దారుణమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Also Read : వెర్రి అభిమానానికి అప్పట్లో ఏకంగా 16 మంది.. భారత క్రీడా చరిత్రలో అత్యంత విషాదాలివి!
సరిగా 2024 లో జూలై నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ ప్రాంతంలో భోలే బాబా సత్సంగ్ లో 121 మంది భక్తులు చనిపోయారు.. ఇక 2024లో డిసెంబర్ నెలలో పుష్ప -2 సినిమా ముందస్తు విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయింది. ఆమె కుమారుడి పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారి నేపథ్యంలో కి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మహా కుంభమేళాలో 30 మంది కన్నుమూశారు. 2025 మే నెలలో గోవాలోని ఓ ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఆరుగురు చనిపోయారు. వాస్తవానికి ఈ ఘటనలన్నీ జరిగినప్పుడు అటు ప్రభుత్వాలు, ఇటు మీడియా విపరీతమైన హడావిడి సృష్టించింది.
హద్దులు దాటిన అభిమానం.. ఎల్లలు దాటిన మూఢభక్తి.. వంటివి ఈ ఘటనలు చోటు చేసుకోవడానికి కారణమయ్యాయి. కారణాలు ఏమైనా సరే ఆరు చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగి.. ఏకంగా 175 మంది మృతి చెందడం యావత్ దేశాన్ని నివ్వెర పరుస్తోంది. ” ఇటువంటి సంఘటనలు దేశానికి అత్యంత ప్రమాదకరం. ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. తర్వాత కొద్ది రోజులకే ప్రజలు వాటి గురించి మర్చిపోతారు. ఆ తర్వాత షరా మామూలే. అందుకే మూఢభక్తి ఉండకూడదు. ఎల్లలు దాటిన అభిమానం అసలు ఉండకూడదని” నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా గుమికూడి పోకుండా.. తండోపతండాలుగా వెళ్లకుండా.. కాస్త జాగ్రత్తలను పాటిస్తే అభిమానులు, భక్తులు తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వారు పేర్కొంటున్నారు.