Covid Travel Rules India: కోవిడ్ చైనాలో కనీవిని ఎరుగని ఉత్పాతాన్ని సృష్టిస్తోంది. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వృద్ధులు నరకం చూస్తున్నారు. స్మశాన వాటిక లకు రోజు వందల సంఖ్యలో మృతదేహాలు వస్తున్నాయి. ఎన్ని కేసులు నమోదవుతున్నాయో చైనా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ… అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో వైరస్ మనదేశంలో ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది.. ఇందులో భాగంగా ముక్కు ద్వారా వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. గతంలో కోవిడ్ మొదటి, రెండు దశలు ప్రబలినప్పుడు కొంతమేర నిర్లక్ష్యం వల్ల దేశంలో అల్లకల్లోలం ఏర్పడింది.. గతంలో నేర్చుకున్న పాఠాలు, ఇప్పుడు చైనాలో పరిస్థితి.. దీంతో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఆదేశాలపై ఆంక్షలు
కోవిడ్ 19 కేసులు ఉదృతం అవుతున్న ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత్ ఆంక్షలు విధించింది.. హాంకాంగ్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికులకు కోవిడ్_ 19 నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.. జనవరి ఒకటి నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది..ఈ ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వారి ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.. నెగిటివ్ రిపోర్టును ఎయిర్ సువిధ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ర్యాండమ్ గా రెండు శాతం మందికి విమానాశ్రయాల్లోనే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా భారత్ లో శుక్రవారం ఉదయానికి అంటే గడిచిన 24 గంటల్లో 2.45 లక్షల పరీక్షలు నిర్వహించారు. 278 మందిలో పాజిటివ్ లక్షణాలు కనిపించాయి.. ఇక గురువారం కేరళ, మహారాష్ట్రలో ఇద్దరు కోవిడ్ తో మరణించారు.. ప్రస్తుతం దేశంలో 3,552 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. బీహార్ లో కోవిడ్ కేసులు పదిరెట్లు పెరిగాయి. గత వారాంతం తో పోలిస్తే గురువారం 14 కేసులో నమోదయ్యాయి. ఇక తాజ్ మహల్ ను సందర్శించిన ఓ విదేశీ పర్యాటకుడికి పరీక్ష చేస్తే పాజిటివ్ గా తేలింది. అతడు పక్క లేకుండా పోయాడు.
చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
చైనా నుంచి సింగపూర్ విమానం ద్వారా కోయంబత్తూర్ కు వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సేలానికి చెందిన ఆ వ్యక్తి ఈనెల 27న కోయంబత్తూరు విమానాశ్రయానికి వచ్చాడు.. సిబ్బంది పరీక్షలు నిర్వహించగా కోవిడ్ లక్షణాలు కనిపించకపోవడంతో బయటకు పంపించారు.. గురువారం వెలువడిన ఫలితాల్లో అతడికి కోవిడ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇక చైనాలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. జపాన్ లో ఒక్కరోజులోనే 415 మరణాలు నమోదు అయ్యాయి. బుధవారం ఒక్కరోజే రెండు లక్షలకు పైచిలుకు కొత్త కేసులు రికార్డు అయ్యాయి.. అక్కడ పాజిటివిటీ రేటు నాలుగు శాతం గా ఉంది. ఇక చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య కూడా పెరుగుతున్నది . భారత్ సహా జపాన్, అమెరికా, తైవాన్, మలేషియా, సింగపూర్ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 నెగటివ్ సర్టిఫికెట్ ను తప్పనిసరి చేశాయి. తాజాగా ఇటలీ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. ఐరోపా సమాఖ్యను కూడా ఆంక్షలు సిద్ధమవ్వాలని కోరింది.