Pawan kalyan Contest As MP: ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వనని పవన్ కళ్యాణ్ గట్టిగానే డిసైడ్ అయ్యారు. ఇందుకు అవసరమైతే అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటానని కూడా ప్రకటించారు. వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ప్రతిసారి అలాగే ప్రకటనలు చేస్తున్నారు. వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి అడ్వాంటేజ్ అయిన ఏ అంశాన్ని పవన్ విడిచిపెట్టడం లేదు. అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. తటస్థులను పార్టీలోకి తెచ్చి ఎంపీ; ఎమ్మెల్యేలుగా పోటీచేయించాలని చూస్తున్నారు. తాను ఒక చోట పోటీచేయాలా? లేకుంటే గత ఎన్నికల మాదిరిగా రెండు నియోజకవర్గాలా అని తర్జనభర్జన పడుతున్నారు. బలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఏ నియోజకవర్గమైతే బాగుంటుందో సర్వే చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ బాధ్యత ఓ సర్వే సంస్థకు అప్పగించారు. అయితే ఎంపీగా కూడా పోటీచేయాలని ఒక ఆలోచన ఉన్నట్టు సమాచారం. నరసాపురం నుంచి ఎంపీగా పోటీచేస్తే ఎలా ఉంటుందని పార్టీ శ్రేణుల వద్ద ఆరాతీసినట్టు తెలుస్తోంది. అక్కడ క్షత్రియులతో పాటు కాపు సామాజికవర్గం అవసరం. కాపు సామాజికవర్గం పవన్ వెంట నడుస్తోంది. క్షత్రియులు టర్న్ కావాలంటే రఘురామరాజు సేవలను వినియోగించుకోవాలనిఆలోచన చేస్తున్నట్టు తెలిసిందే. నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి రఘురామకు పోటీచేయించి.. తాను ఎంపీగా బరిలో నిలవాలని తాజాగా పవన్ ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ తాజా స్కెచ్ వెనుక పవన్, రఘురామ, చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన మధ్య సానుకూల వాతావరణం ఉంది. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీచేస్తాయన్న ప్రచారం ఉంది. అటు టీడీపీ, జనసేన క్యాడర్లు సైతం మానసికంగా సిద్ధమైపోయాయి. అధికార వైసీపీ సైతం ఇదే ఆరోపణలు చేస్తోంది. అటు బీజేపీకి మిత్రపక్షంగా జనసేన కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల కోసం చంద్రబాబు పరితపిస్తున్నారు. అందుకే తెలంగాణలో పార్టీని తట్టిలేపి మరీ బీజేపీ చేతిలో పెట్టాలని చూస్తున్నారు. దాని ప్రతిఫలం ఏపీలో పొందాలని భావిస్తున్నారు. అటు రఘురామ విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేనలు సైతం ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నాయి. మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి రఘురా బరిలో దిగడం ఖాయం. అయితే పవన్ ఎంపీగా పోటీచేసి.. అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రఘురామను పోటీచేయిస్తే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేశారు. కానీ రెండుచోట్ల ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఆ రెండు నియోజకవర్గాలపై కూడా పెద్దగా దృష్టిసారించిన దాఖలాలు లేవు. అందుకే ఈసారి ఎంపీగా పోటీచేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా బీజేపీ నాయకత్వం కూడా పవన్ ను ఎంపీగా పోటీచేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాధిలో బీజేపీ మెజార్టీ ఎంపీ స్తానాలు కోల్పోవడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆ నష్టాన్ని ఉత్తరాధితో భర్తీ చేసుకోవాలని మోదీ ప్లాన్ చేస్తున్నారు. కానీ దక్షిణాదిలో పార్టీకి అంతంతమాత్రంగానే బలం ఉంది. అందుకే పవన్ లాంటి వారు ఎంపీలుగా ఉంటే మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారు. మరోవైపు రఘురామ గత ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. అక్కడకు కొద్దిరోజులకే హైకమాండ్ కు దూరమయ్యారు. రెబల్ గా మారారు. వైసీపీ సర్కారుకు టార్గెట్ అయ్యారు. చాలారకాలుగా ఇబ్బందులు పడ్డారు. చివరకు సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన సత్తా జగన్ కు చూపాలని భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన సాయంతో రివేంజ్ కు వ్యూహాలు పన్నుతున్నారు.