AP Volunteers: ‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు వలంటీర్లు, వారికి ఎంతచేసినా తక్కువే. అందుకే ఏటా ఉగాది నాడు సన్మానిస్తున్నాం. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలు అందిస్తున్నాం. ప్రోత్సాహక నిధిని అందిస్తున్నాం’.. ప్రభుత్వ అధినేత నుంచి అమాత్యులు, ఎమ్మెల్యేలు చెప్పిన మాటలివి. అయితే ఇది జరిగి నెల గడుస్తున్నా వలంటీరు ఖాతాల్లో ప్రోత్సాహక నిధి మాత్రం జమకాలేదు. అన్నింటి మాదిరిగానే మానసపుత్రికలైన వలంటీర్ల విషయంలో కూడా ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని చూపించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీరు వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించి పౌరసేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు.

పంచాయతీకి 10 మంది చొప్పున నియమించారు. అయితే వీరికి ఇస్తున్న వేతనం రూ.5 వేలు కావడంతో.. వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏటా ఉగాది నాడు పురస్కారాలను అందించాలని నిర్ణయించింది. సేవామిత్ర, సేవారత్న, సేవావజ్రాలుగా విభజించింది. సేవామిత్రలకు రూ.10 వేలు, సేవారత్నలకు రూ.20 వేలు, సేవావజ్రాలకు రూ.30 వేలు ప్రోత్సాహక నిధిని ప్రటించింది. ఏప్రిల్ 2న ఉగాది నాడు పురస్కారాలను అందించింది. ఘనంగా సన్మానించింది. 48 గంటల్లో ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ కార్యక్రమం జరిగి దాదాపు 40 రోజులు దాటుతున్నా వలంటీర్ల ఖాతాల్లో నగదు జమకాలేదు. వీరందరికీ ఎదురుచూపులు తప్పడం లేదు.
Also Read: Analysis on Narayana Arrest : నారాయణ అరెస్ట్ పై ఎన్నో అనుమానాలు?
ప్రభుత్వ తీరుపై అసంతృప్తి
ప్రభుత్వ తీరుపై వలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమతో అన్ని పనులు చేయించుకున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని తప్పుపడుతున్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగా ప్రశ్నిస్తే ఎక్కడ తొలగిస్తారేమోనని భయపడుతున్నారు. ఆర్భాటంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్రాల ఎంపికలో కూడా నేతల సిఫారసులకు పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహక నిధిని ఖాతాల్లో జమ చేయాలని బాధిత వలంటీర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

విధుల నుంచి తొలగింపు
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మండలానికి వందలాది మంది చొప్పున విధుల నుంచి తొలగిస్తున్నారు. రకరకాల కారణాలు చూపుతూ వారి శ్రీముఖాలు పంపిస్తున్నారు. చాలాచోట్ల అధికార పార్టీలో విభేదాలకు వలంటీర్లు బలవుతున్నారు. తమ మాట వినలేదని కొందరికి, రాజకీయాలు చేస్తున్నారని మరికొందరికి, టీడీపీకి సహకరిస్తున్నారని ఇంకొందరికి, విధులు సక్రమంగా లేదని కొందర్ని విధుల నుంచి తొలగిస్తున్నారు. దీంతో వలంటీర్ల వ్యథ అంతా ఇంతా కాదు. ఎంతో సంతోషంగా వలంటీరు విధులు బాధ్యతగా నిర్వర్తిస్తుంటే ప్రభుత్వ తీరు సరిగ్గాలేదని మానస పుత్రికలైన వలంటీర్లే చెబుతున్నారు.
Also Read:BJP Master Plan In Telangana: కేసీఆర్ తో మైండ్ గేమ్.. తెలంగాణలో బీజేపీ మాస్టర్ ప్లాన్?
[…] Also Read: AP Volunteers: వలంటీర్లకు పంగనామం.. సత్కారాలతో… […]