New Parliament Building Inauguration
New Parliament Building Inauguration: ప్రధాన మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశానికి కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. రూ.970 కోట్ల రూపాయలతో అధునాతన పార్లమెంట్ భవన సముదాయాన్ని నిర్మించింది కేంద్రం. ఈ నెల 28 సావర్కర్ జయంతి రోజున ఈ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే, ఇదే ఇప్పుడు పాలక, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి కారణమవుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటుకు నూతన భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన పెట్టింది కేంద్రం. అందుకు అనుగుణంగానే శర వేగంగా భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించేందుకు నిర్ణయించిన రోజును ఇప్పుడు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జాతిపిత మహాత్మా గాంధీని జీవితాంతం వ్యతిరేకించిన సావర్కర్ జయంతి రోజున భవనాన్ని ప్రారంభించడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. ముందుగా నిర్ణయించిన రోజునే పార్లమెంట్ భవనం ప్రారంభిస్తామని కేంద్రం స్పష్టం చేస్తోంది.
రాజ్యాంగ విరుద్ధమంటున్న ప్రతిపక్షాలు..
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతిని అడగకపోవడం పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతకర్త అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి రోజునే కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి ముహూర్తంగా ప్రభుత్వం ఎన్నుకోవడంపైనా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు సావర్కర్ ను ఒక విభజన వాదిగా పరిగణిస్తుండగా, అధికార బిజెపి ఆయనను ఒక హీరోగా చూస్తోంది. ఇదే ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత వివాదాన్ని పెంచుతోంది.
భారతదేశ వ్యవస్థాపకులను అవమానించినట్లే..
విభజన వాది అయిన సావర్కర్ జయంతి రోజున పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం అంటే భారతదేశ వ్యవస్థాపకులను అవమానించినట్టే అని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. మహాత్మా గాంధీని జీవితాంతం వ్యతిరేకించిన వ్యక్తి జయంతి రోజున కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ తీవ్రంగా విమర్శించారు. ఇది ముమ్మాటికి బిజెపి అహంకార ధోరణికి నిదర్శనమని ప్రతిపక్షాలు గట్టిగానే బిజెపిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. భారత రాష్ట్రపతి, పార్లమెంటుకు అధిపతి అయిన ద్రౌపది ముర్మును ప్రభుత్వం పక్కన పెట్టడంపై విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ అనేది గణతంత్ర భారత సర్వోన్నత వ్యవస్థ అని, పార్లమెంట్ కు రాజ్యాంగబద్ధంగా అధిపతి రాష్ట్రపతి అని, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, పౌరులకు రాష్ట్రపతి మాత్రమే ప్రతినిధి అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘ కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ ఔచిత్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా ఉంటుంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్న బిజెపి..
ఈ నెల 28 సావర్కర్ జయంతి రోజున కొత్త భవనాన్ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని బిజెపి మాత్రం సమర్ధించుకుంటుంది. కొత్త పార్లమెంట్ అనేది భారత ప్రజలకు గర్వకారణమని బిజెపి వ్యాఖ్యానించింది. ముందు పేర్కొన్నట్టుగానే షెడ్యూల్ ప్రకారం కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరుగుతుందని, ఇందులో మరో ప్రశ్నకు తావే లేదని బిజెపి స్పష్టం చేస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కొట్టిపారేశారు. శుభ సమయాల్లో రాహుల్ గాంధీ ఆపశకునంలా అడ్డు తగులుతారని, చారిత్రక క్షణాలను ఆయన స్వాగతించలేరని పేర్కొన్నారు.
రెండేళ్లలో కొత్త పార్లమెంటు భవనం పూర్తి..
2021 జనవరిలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో ఈ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నాలుగు అంతస్తుల ఈ భవన డిజైన్ ను హెచ్సిపి డిజైన్ సంస్థ రూపొందించగా, టాటా ప్రాజెక్ట్స్ సంస్థ దీనిని నిర్మించింది. ఇప్పుడున్న పార్లమెంట్ కంటే సీట్ల సంఖ్యను ఇందులో పెంచారు. ఇప్పుడున్న బ్రిటిష్ కాలం నాటి పార్లమెంట్ భవనం కూడా మనుగడలోనే ఉంటుంది. కొత్త భవనం ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రణాళికను ప్రభుత్వం గత వారంలోనే ప్రకటించింది. 2020లో జరిగిన పార్లమెంటు శంకుస్థాపన కార్యక్రమానికి కరోనా మహమ్మారి కారణంగా ప్రతిపక్ష పార్టీలు హాజరు కాలేదు. సావర్కర్ జయంతి రోజున ప్రారంభోత్సవాన్ని పెట్టడంతో బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రధాని మోడీకి గాంధీజీ కంటే సావర్కర్ పై ప్రేమ ఎక్కువగా ఉండడం వల్లే ప్రారంభోత్సవాన్ని సావర్కర్ జయంతి రోజు పెట్టారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.