Southwest Monsoon 2024: ఈసారి నైరుతి సకాలంలోనే వచ్చేసింది. గురువారం కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకినట్లు ఐఎండి ప్రకటించింది. మేఘాల కదలికలను బట్టి మరో మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోకి ప్రవేశించవచ్చని ఐఎండి అంచనా వేస్తుంది. 1953 నుంచి 2023 మధ్యకాలంలో ఎల్నినో కారణంగా పలు సంవత్సరాల్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదయింది. కానీ,ఈసారి అలాంటి పరిస్థితులు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ఐయిదారేళ్ల మాదిరే ఈసారి వర్షాలు పుష్కలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
లానినో కారణంగా పసిఫిక్ మహాసముద్రం కాస్త చల్లబడిందని..ఆ ప్రభావం ఈసారి దేశీయ వర్షపాతంపై ఉంటుందని ఐఎండి చెబుతోంది. అయితే వాయువ్య,తూర్పు రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గొచ్చని శాస్త్రవేత్తలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. భారత దేశం ప్రధానంగా వర్షపాత ఆధారిత వ్యవసాయక దేశం. దేశం మొత్తం కురిసే వర్షంలో ఒక్క నైరుతి నుంచే 45 నుంచి 55 శాతం ప్రతీ ఏటా ఉంటోంది. నైరుతి రుతుపవనాల వల్ల కురిసిన వర్షపాతం ఆధారంగా పండిన పంటల ద్వారానే దేశంలో 60 శాతం పంట దిగుబడులు సాధ్యమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతటి కీలకమైన నైరుతి రుతుపవనాల్లో ఈసారి కదలికలు చాలా చురుగ్గా కనిపిస్తున్నాయి. రోహిణి కార్తీ ప్రారంభమై నాలుగు రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలోనే కేరళను నైరుతి రుతుపవనాలు తాగడం.. సకాలంలో అవి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పుతుండడంతో.. వ్యవసాయ ఆధారిత పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అనిపిస్తోంది.
రైతుల కూడా ఈసారి వర్షాలు పడగానే వెంటనే విత్తనాలు వేసుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మెట్ట ఆధారిత పంటల భూములను దుక్కులుగా చేసుకొని పంటలు వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు మరో మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉన్నందున.. అన్నదాతలందరూ విత్తనాలు విత్తుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.