South Korea : 25 ఏళ్ల దాకా చదువు.. తర్వాత కెరియర్.. ఈ లోగానే సగం జీవితం పూర్తవుతోంది. నెత్తి పైన బట్ట, ముందు పొట్ట పెరుగుతోంది. ఫలితంగా జీవితం ఒంటికాయ శొంఠి కొమ్ము అవుతోంది. యువతుల పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వారు కూడా చదువు, ఉద్యోగ వేటలో పడి ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే విషయాలను వాయిదా వేస్తున్నారు. ఫలితంగా ఆ పుణ్యకాలం కాస్త పూర్తవుతున్నది. అది అంతిమంగా జనాభా వృద్ధిరేటుపై పడుతోంది. జనాభా వృద్ధిరేటు తగ్గితే ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితిని దక్షిణ కొరియా దేశం చవిచూస్తోంది. జననాల రేటు తగ్గడంతో అక్కడ జనతిరోగమనం నమోదవుతోంది. దక్షిణ కొరియాలో జననాల రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన బూ యూంగ్ అనే నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిడ్డకు జన్మనిచ్చిన ఉద్యోగులకు తిరుగులేని బోనస్ ప్రకటించింది. ఒక బిడ్డకు జన్మనిస్తే 62 లక్షలు చెల్లిస్తోంది. 2021 నుంచి ఇప్పటివరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు 43.65 కోట్లు చెల్లించింది. సంస్థలోని స్త్రీ, పురుష ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని.. జన్మనిచ్చిన ప్రతిసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని ఆ సంస్థ వివరించింది.
దక్షిణ కొరియా దేశంలో కొంతకాలంగా జనాభా తిరోగమనం దిశగా సాగుతోంది. ముఖ్యంగా యువత పెళ్లిలను వాయిదా వేయటం, చదువు, ఉద్యోగాల పేరుతో వేచి చూసే ధోరణి అవలంబించడం, పిల్లల్ని కనే విషయంలోనూ అదే పద్ధతిని అనుసరిస్తుండడంతో జనాభా తగ్గుదల నమోదవుతోంది. దీంతో దక్షిణ కొరియా దేశంలో జనాభా పెంపుదల కోసం అక్కడి ప్రభుత్వం రకరకాల ప్రయోగాలు చేస్తోంది. అయినప్పటికీ అవి పెద్దగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో నిర్మాణ రంగంలో ఉన్న బూ యూంగ్ అనే సంస్థ బిడ్డకు జన్మనిచ్చిన ఉద్యోగులకు బోనస్ చెల్లిస్తోంది. ఇలా బోనస్ చెల్లించడం వల్ల ఉద్యోగులు దేశం గురించి ఆలోచిస్తారని బూ యూంగ్ చెబుతోంది.. అంతేకాదు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇది ప్రోత్సాహంగా ఉంటుందని బూ యూంగ్ వివరిస్తోంది.
బూ యూంగ్ బోనస్ ఇస్తున్న నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు 2021 నుంచి 2024 ఫిబ్రవరి 9 వరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చారు. మూడు సంవత్సరాలలో 70 మంది పిల్లలు అంటే మామూలు విషయం కాదని బూ యూంగ్ సంస్థ చెబుతోంది. తమ సంస్థ ఉద్దేశం జనాభా విస్ఫోటనం కాదని.. జనాభా తిరోగమనాన్ని నిరోధించడమేనని అంటోంది. ప్రస్తుతం బూ యూంగ్ సంస్థ చేస్తున్న ఈ పనిని దక్షిణ కొరియా వాసులు మెచ్చుకుంటున్నారు. బోనస్ ఇవ్వడం వల్ల ప్రజలు పిల్లలను కనేందుకు ఉత్సాహం చూపుతారని చెబుతున్నారు.