Android users : అర చేతిలో స్మార్ట్ ఫోన్. మనలో చాలామందికి ఆపిల్ ఫోన్లు కొనే స్తోమత ఉండదు కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్ లనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆండ్రాయిడ్ అనేది తక్కువ ఖర్చులో లభించే ఆపరేటింగ్ సిస్టం కాబట్టి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పైగా ఆండ్రాయిడ్ యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది..
ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లు వాడే వినియోగదారులకు కేంద్రానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ అటాకర్లు సులువుగా దాడి చేసి విలువైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ వెర్షన్స్ 11,12,12L,13,14 లకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. దీనికి పరిష్కారంగా కంపెనీ నుంచి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఒక నివేదిక ప్రకారం ఐవోఎస్ ఫోన్ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్లను సైబర్ ఎటాకర్లు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. విలువైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. చాలామంది ఫోన్లలో డీజిటల్ బ్యాంకింగ్ ను వాడుతుండడంతో అందులో ఉన్న నగదును మొత్తం దోచుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఫోన్లు వాడే యూజర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. యూజర్ ఫ్రెండ్లీ కావడంతో ఏవి పడితే అవి అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరించింది. అలా చేస్తే ఫోన్ లో ఉన్న వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లుతుందని.. విలువైన సమాచారం మొత్తం వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందని వివరించింది.
ఓ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతిరోజు వందల సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నాయి. హ్యాకర్లు అత్యంత తెలివిగా స్మార్ట్ ఫోన్ లోకి ప్రవేశించి దర్జాగా దోచుకుంటున్నారు. ఒకవేళ ఖాతాలో సరైన స్థాయిలో నగదు లేకుంటే ఫోటోలు లేదా వీడియోలను అశ్లీల సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. వాటిని తొలగించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరైతే డబ్బులతోపాటు రకరకాల వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో యూజర్లను జాగ్రత్తపరిచేందుకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హైరిస్క్ వార్నింగ్ ఇచ్చింది. ఫోన్లో వాడే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని.. అడ్డగోలుగా వ్యవహరిస్తే మూల్యం తప్పదని పేర్కొన్నది. ఓ సర్వే నివేదిక ప్రకారం మనదేశంలో ఆండ్రాయిడ్ యూజర్లు సైబర్ దాడుల వల్ల వందల కోట్ల విలువైన సొమ్మును కోల్పోతున్నారు..