Festivals: దేశంలో ప్రస్తుతం ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. శబరిమల యాత్ర కొనసాగుతోంది. క్రిస్మస్, తర్వాత న్యూ ఇయర్ వేడుకలు, ఆ తర్వాత సంక్రాంతి ఇలా వరుస పండగలతో ప్రజలంతా గుమిగూడే సమయం వచ్చింది. దీంతో కరోనాకు కూడా టైమ్ స్టార్ట్ అయిందంటున్నారు నిపుణులు. రెండు వ్యాక్సిన్లు, బూస్టర్ డోస్ వేసుకున్నాం.. మమ్మల్ని కరోనా ఏం చేయదు అనుకుంటే ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మహమ్మారి మళ్లీ వచ్చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైరస్‌పై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. మన దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది. పెద్దవారితోపాటు నెలల చిన్నారులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్ కేసులు పెరిగితే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
రెండు నెలలుగా వ్యాప్తి..
నిజానికి కరోనా వ్యాప్తి దేశంలో రెండు నెలల కిందటే మొదలైంది. పొరుగు దేశం చైనా మరోసారి కరోనా కొత్త వేరియంట్‌తో అతలాకుతలమైంది. కానీ భారత్ మాత్రం లైట్ తీసుకుంది. ఎప్పుడైతే కేరళలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్–1 విజృంభించిందో, అప్పుడు అలెర్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళలో కేసులు పెరుగుతుండడం, తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమళ వెళ్లి వస్తుండడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
పండుగల వేళ, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వేసుకోవాలని, చిన్నారులు, గర్భిణిలు సమూహాలకు దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఈ జేఎన్1 వేరియంట్ వల్ల ప్రాణాలకు ముప్పు అంటున్నారు. కొత్త వేరియంట్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాలు తీస్తుందని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. పాత కరోనా తరహా లక్షణాలకే ఈ కొత్త వేరియంట్ లక్షణాలుగా ఉన్నాయని అంటున్నారు. కొత్త కరోనా వేరియంట్ లక్షణాలు కూడా ఇవే. కాబట్టి నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. జన సమూహంలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం మంచిదని కేంద్రం సూచించింది. చలికాలంలో శీతల వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున.. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గతంలో కొవిడ్ బారిన పడ్డవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.