Kaushik Reddy: ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం వెల్లడవుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు ఇరు పార్టీల నేతలకు టెన్షన్ ఎక్కువవుతోంది. మొదటిగా వెలువరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్‌కు మెజారిటీ వచ్చింది. తరువాత ఈవీఎంలను లెక్కించడం ప్రారంభించారు. మొదటి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజలో ఉంటూ వచ్చారు. ఇదే తీరు 7వ రౌండ్ వరకు కనిపించింది. కానీ ఒక్క సారిగా 8వ రౌండ్‌లో పరిస్థితి తారుమారు అయ్యింది. 8వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ లీడ్‌లోకి వచ్చారు. 8వ రౌండ్ ముగిసే సరికి ఆయన దాదాపు 130 ఓట్లు ముందంజలో ఉన్నారు. కానీ మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. 9వ రౌండ్ వచ్చేసరికి ఈటల 1835 ఓట్ల లీడ్‌లోకి వచ్చారు. ఇలా విజయం రెండు పార్టీలను తికమక పెడుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్న చాలా మంది ఇలానే తికమకపడుతుంటే ఓ నేత మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు. ఆయనెవరో కాదు సరిగ్గా హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌కు వచ్చిన కౌషిక్ రెడ్డి. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఆయనకు చాలా అవసరం.

గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కౌషిక్ ఓటమి..
కౌషిక్ రెడ్డి.. మొదటి నుంచి హుజూరాబాద్ లో స్థానికంగా ఉన్న నేత. కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. అప్పటికే మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌కు చాలా గట్టి పోటీనే ఇచ్చారు. చాలా స్వల్ప మెజారిటీతో ఈటల ఆ ఎన్నికల్లో గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్‌కు సంస్థాగతంగా ఉన్న ఓట్లు, ఆయనకు ప్రజల్లో ఉన్న పలుకుబడి ఆయనను విజయానికి దగ్గరగా తీసుకొచ్చాయి. కానీ అప్పుడు 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ గాలులు వీయడంతో కౌషిక్ రెడ్డి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ నాయకుడిగానే ఉంటూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు రావడం, టీఆర్ఎస్ అధిష్టానం దానిని సీరియస్‌గా తీసుకోవడం వంటి విషయాలు చోటు చేసుకున్నాయి. అనంతరం ఈటల తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ సమయంలో టీఆర్ఎస్ దృష్టి కౌషిక్ రెడ్డిపై పడింది. ఈటలకు పోటీగా ఆయనను నిలపాలని భావించింది. కానీ తరువాత జరిగిన కొన్ని పరిణామాలు ఆయనకు సీటు దక్కకుండా చేశాయి. కానీ టీఆర్ఎస్ ఆయనను ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని భావించింది. కౌషిక్ రెడ్డిని స్పోర్ట్స్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ గవర్నర్‌కు సిఫారసు చేసింది. కానీ ఈ ఫైల్ ఇప్పుడు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది.
Also Read: Huzurabad bypoll results: వీణవంకపైనే టీఆర్ఎస్ బోలెడు ఆశలు.. అక్కడ పోతే హుజూరాబాద్ పోయినట్టే??
గెలిస్తేనే ఎమ్మెల్సీ పదవా ?
కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంతో.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత ఆయనపై పడింది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం కోసం ఆయన దాదాపు 5 నెలల నుంచి కష్టపడుతూ వస్తున్నారు. మొదటి నుంచీ ప్రచారంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. ప్రతీ అంశంలోనూ టీఆర్ఎస్ తరఫున గట్టిగా వాదన వినిపించేవారు. టీఆర్ఎస్ ను గెలిపించేందుకు ఆయన సాయశక్తులా కృషి చేశారు. అయితే ఇప్పుడు విజయం ఎవరిని వరిస్తోందో అని ఉత్కంఠ కొనసాగుతోంది. ఒక వేళ ఫలితం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తే కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందో లేదో అని అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఆయన కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రాకపోయినా.. మరేదయినా ముఖ్యమైన పదవిని కట్టబెడుతారనే హామీని టీఆర్ఎస్ కౌషిక్ రెడ్డికి ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విజయంపై మాత్రమే అది ఆధారపడి ఉంటుందని మాత్రం చెబుతున్నారు.
Also Read: ‘ట్రెండింగ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’.. సినిమా గురించి కాదండోయ్!