CM KCR: కేసీఆర్ ఒకటి తలిస్తే.. మరొకటి జరుగుతోందా? అందుకే ఆయన మౌనాన్ని ఆశ్రయించారా? టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్‌కు కేంద్రంలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణాలు సరైన మార్గం లేకుండా చేస్తున్నాయా? అంటే ఔను అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ బలం పుంజుకుంటుండడం బీఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులుగా ఎంపికైన వారికి సమస్యగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎప్పుడు అందిస్తారంటూ జనంతోపాటు ప్రతిపక్షాలు నిత్యం ప్రశ్నిస్తున్నాయి. ఈ విమర్శలను తిప్పికొట్టడం, ఎన్నికలు జరిగేదాకా అనుచర వర్గాలను వెన్నంటే ఉండేలా చూసుకోవడం వారికి సవాలుగా మారింది. ఈ విషయాన్ని అధినేతకు చెప్పలేక, నియోజకవర్గాల్లో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాక వారు సతమతమవుతున్నారు. మరోవైపు అభ్యర్థిత్వం దక్కని ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు ఏంటని ఆందోళన చెందుతున్నారు.
వేగంగా ప్రతిపక్షాల చర్యలు..
ప్రతిపక్షాల కంటే ముందుగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తే ఇబ్బందులు ఉండవని భావించిన బీఆర్‌ఎస్ కు ఊహించని స్థాయిలో అసంతృప్తుల సెగ తగులుతోంది. మరోపక్క, అసంతృప్తులను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా అధికార పార్టీ అంచనాలకు అందకుండా పావులు కదుపుతున్నాయి. దీంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి తప్పు చేశామా? అని బీఆర్‌ఎస్ అధిష్ఠానం అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. దీనికి పరిష్కారం.. ఎన్నికల సమయానికి అభ్యర్థులను మార్చడమేనని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే.. ప్రస్తుతం ప్రకటించిన ముందస్తు జాబితాలో స్థానం దక్కని అభ్యర్థులతోపాటు, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం కోరుతున్న వారంతా రోజూ ప్రగతిభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు పార్టీలోని ముఖ్యులను కలిసి తమ వివరాలు చెప్పుకోవాలని హైదరాబాద్‌కు వస్తున్నారు. కానీ, ప్రగతి భవన్‌లోకి అందరికీ ప్రవేశం లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఏదో ఒక సమయంలో ముఖ్యమంత్రిని కలిసి వెళ్తున్నారు.
ఖర్చు అదిరిపోతోంది
అభ్యర్థిత్వం దక్కిన అభ్యర్థులకు కూడా సంతోషం లేకుండా పోయింది. ఇందుకు అసంతృప్తులు ఒక కారణమైతే, అనుచర వర్గాన్ని కాపాడుకునేందుకు చేయాల్సివస్తున్న ఖర్చు మరో కారణం. నియోజకవర్గాల్లో అసమ్మతులను అభ్యర్థిత్వం దక్కిన వారే సముదాయించుకోవాలని అధిష్ఠానం సూచించడంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. వారిని బుజ్జగించడం ఎలాగో తెలియక అయోమయానికి గురవుతున్నారు. దీనికితోడు ఎన్నికలు జరిగే మరో మూడు నెలలపాటు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులను తమ కనుసన్నల్లో ఉంచుకునేందుకు అయ్యే ఖర్చు కూడా అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ముందస్తుగా తమను ఎంపిక చేయడం ఎన్నికల్లో ఏ మేరకు మేలు చేస్తుందో ఏమో గానీ, ఇపుడు మాత్రం తమకు ఎన్నడూ లేనన్ని సమస్యలు వస్తున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు.
వేగంగా మారుతున్న సమీకరణలు..
ఇటు రాష్ట్రంలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న గులాబీ బాస్ కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు ఎదురవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దూకుడు గా కాంగ్రెస్
తెలంగాణలో కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటోంది. ఇప్పటికే పార్టీలోని సీనియర్లంతా సమైక్యతా రాగం అందుకోవడంతో.. నియోజకవర్గాల రాజకీయ పరిస్థితుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎ్‌సలోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకోవడంలోనూ కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల విషయంలోనూ జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటోంది. బీజేపీ కూడా అంతర్గతంగా పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో జాగ్రత్త వహిస్తోంది. మరోవైపు కేంద్రంలోనూ ‘ఇండియా’ కూటమి రోజురోజుకూ బలం పుంజుకుంటుండడతోపాటు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో గెలుపు పవనాలు తమవైపు వీస్తున్నాయనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, ఆ పార్టీ పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను జనంలోకి తీసుకెళ్లడంలో కూటమి విజయవంతమవుతోంది. ఇవన్నీ అధికార బీఆర్‌ఎస్ అంచనాలకు అందడంలేదు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే ఆ పార్టీ అధిష్ఠానం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబరు 17పై బీఆర్‌ఎస్ మిన్నకుండిపోయింది. ఆ రోజు సభలు, సమావేశాలు వంటివి నిర్వహించనున్నట్లు కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు సెప్టెంబరు 17 రోజు సమావేశాలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. 17న బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్‌లో ‘అమృత్ మహోత్సవ్’ ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. కాగా, 16, 17తేదీల్లో హైదరాబాద్ వేదికగా నిర్వహించబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల అనంతరం 17న పది లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు సీపీఐ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉత్సవాలను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్టు తెలిసింది.